గ్రేటర్‌లో భాజపాకు అనూహ్య ఫలితాలు

గ్రేటర్‌లో భాజపాకు అనూహ్య ఫలితాలు

హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి చుక్కెదురైంది. మొత్తం 150 వార్డులకు గాను 56 స్థానాల్లో మాత్రమే గెలుపొంది కార్పొరేషన్‌లో అధికారానికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. దుబ్బాక ఉప ఎన్నికలో అనూహ్య విజయంతో ఉత్సాహం మీదున్న బీజేపీ ఈ ఎన్నికల్లోనూ అదే ఊపును కొనసాగించింది. మొత్తం 49 స్థానాల్లో విజయం సాధించడం ద్వారా ఆ పార్టీ అధికార తెరాసకు నువ్వా నేనా అన్నట్లు గట్టి పోటీనిచ్చింది. పాత బస్తీలో ఎంఐఎం తన ఆధిపత్యాన్ని నిలుపుకొంది. ఆ పార్టీ అభ్యర్థులు 43 స్థానాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్‌ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది.

హైదరాబాద్‌లో ఇటీవల సంభవించిన వరదల్లో అనేక మంది ఆస్తులను కోల్పోయారు. తమకు సరైన సాయం అందలేదని బాధితులంతా అధికార తెరాసపై ఆగ్రహాన్ని కనబరచినట్లు ఈ ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు కుమార్తె ఇన్‌ఛార్జ్‌గా ఉన్న గాంధీ నగర్‌లో తెరాస ఓటమిపాలైంది. మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌లు ఇన్‌ఛార్జులుగా వ్యవహరించి వార్డుల్లో అధికార తెరాసకు పరాభవం ఎదురైంది. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గోషా మహల్‌లోని ఆరు డివిజన్లలోనూ కమలం పార్టీ విజయ బావుటా ఎగురవేసింది.

గ్రేటర్‌ ఎన్నికల్లో దారుణ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. మరో వైపు ఎంఐఎంతో కలసి కార్పొరేషన్‌లో అధికార పగ్గాలను చేపట్టడానికి తెరాస సమాయత్తమవుతోంది. ఈ నెల ఒకటిన పోలింగ్‌ జరుగగా, శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos