భజ్జీ గుడ్‌బై

  • In Sports
  • December 24, 2021
  • 110 Views
భజ్జీ గుడ్‌బై

న్యూఢిల్లీ: టీమిండియా సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (41) కీలక ప్రకటన చేశాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. టీమిండియా సాధించిన ఎన్నో అద్భుతమైన విజయాల్లో హర్భజన్ కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా 2007లో జరిగిన టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ విజయాల్లో హర్భజన్ పాత్ర ఎంతో ఉంది. 1998లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన భజ్జీ.. జాతీయ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. లెగ్ స్పిన్నర్‌గా జట్టులో అడుగుపెట్టినప్పటికీ కీలక సమయాల్లో బ్యాటింగ్‌లో రాణించి జట్టుకు అండగా నిలిచాడు.
హర్భజన్ గురించి తప్పకుండా చెప్పుకోవాల్సిన విషయాల్లో 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ముఖ్యమైనది. ఆ సిరీస్‌లో మూడు మ్యాచుల్లో 32 వికెట్లు తీసిన భజ్జీ హ్యాట్రిక్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాతి నుంచి అతడెప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒకటి తర్వాత ఒకటిగా రికార్డులు సాధిస్తూ ముందుకెళ్లాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

లోయర్ డౌన్‌లో బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచే ఈ పంజాబ్ స్పిన్నర్ ఇండియాలో అత్యంత విజయవంతమైన బౌలర్ల జాబితాలో రెండో వాడిగా పేరు సంపాదించుకున్నాడు. అంతేకాదు, న్యూజిలాండ్‌పై వరుసగా రెండు సెంచరీలు సాధించాడు. అనిల్ కుంబ్లే తర్వాత అత్యధిక వికెట్లు (711) తీసిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు.
భజ్జీ చివరిసారి 2016లో తన చివరి టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన హర్భజన్.. తన 23 ఏళ్ల ప్రయాణం అద్భుతంగా సాగిందని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా అభిమానులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos