సౌందర్యం సంస్కృతి సౌరభాల నిలయం మైసూరు..

  • In Tourism
  • September 30, 2019
  • 314 Views
సౌందర్యం సంస్కృతి సౌరభాల నిలయం మైసూరు..

మైసూరు అనగానే తొమ్మిది రోజుల పాటు కన్నుల పండుగగా జరిగే దసరా ఉత్సవాలకు ప్రసిద్ధి.ఉత్సవాల మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు దసరా ఉత్సవాలు ప్రతిరోజూ విభిన్న కార్యక్రమాలతో అలరిస్తాయి.మైసూరు దసరా ఉత్సవాలను తిలకించడానికి దేశవిదేశాల నుంచి లక్షల సంఖ్యలో పర్యాటకులు తరలివస్తుంటారు.మైసూరు కేవలం దసరా ఉత్సవాలకు మాత్రమే కాదు చారిత్రాత్మక, ఇతిహాసిక, ఆధ్యాత్మిక,పర్యాటక కట్టడాలు, ప్రదేశాలకు అరటిపండ్లు,మైసూరు పాక్‌,మల్లెపూలు,మైసూరు సాండల్‌ సబ్బు,పట్టుచీరలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.మైసూర్ పర్యాటకులకు మైసూర్ ప్యాలెస్ తో పాటు అనేక వారసత్వ భవనాలు, చల్లని నీడనిచ్చే రహదారులు మరచిపోలేని అనుభూతులు. మైసూరులో మైసూర్ ప్యాలెస్ లాంటి అనేక ప్యాలెస్ లు కొలువు తీరి ఉండటం వల్ల రాచనగరి,సాంస్కృతిక నగరిగా కూడా పిలవబడుతోంది.గందపు చెక్కల సువాసనలు, గులాబీల గుభాళింపులతో మైసూర్ నగరానికిశాండిల్ వుడ్అనే పేరు వచ్చింది.నేటికీ విస్తుగొలిపే సౌందర్యంతో, సంస్కృతి సౌరభాల నిలయంగా ఉన్న మైసూరుతో పాటు చుట్టుపక్కనున్న చూడదగిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం పదండి..

మైసూర్ ప్యాలెస్‌ :
మైసూరు పర్యటనలో తప్పకుండా చూడవలసిన జాబితాలో మైసూరు ప్యాలెస్‌ అన్నిటికంటే ముందు ఉంటుంది.నేటి ఆధునిక సాంకేతికకు ఏమాత్రం తీసిపోని రీతిలో శతాబ్దాల క్రితం మైసూరు రాజవంశస్థులు నిర్మించిన మైసూరు ప్యాలెస్‌ చూపు తిప్పుకోనివ్వదంటే అతిశయోక్తి కాదేమో.ప్యాలెస్‌లోని కట్టడాలు,అప్పటి ఆయుధాలు,వర్ణచిత్రాలు ఇలా ఎన్నో చూడొచ్చు..

మైసూర్ ప్యాలెస్

లలితా మహాల్ :
మైసూరు ప్యాలెస్‌ అనంతరం లలితా మహాల్ మైసూర్ నగరంలో రెండవ అతి పెద్ద రాజభవనం.చాముండి హిల్స్‌కు సమీపంలోనున్న లలితమహల్‌ ప్యాలెస్‌ నగరంలోని అందమైన,అద్భుతమైన ఏడు ప్యాలెస్‌లలో రెండోది.ఇది ఇప్పుడు భారతదేశంలోనే అత్యంత సంపన్నమైన హోటళ్ళుగా నడపబడుతున్నది.

లలితా మహాల్

జగన్మోహన్ ప్యాలెస్ :
మైసూరు నగరంలోని ఏడు ప్రముఖ ప్యాలెస్‌లలో జగన్మోహన ప్యాలెస్‌ మూడోది.అందంలో,అద్భుతంలో మైసూరు ప్యాలెస్‌కు.లలిత మహల్‌ ప్యాలెస్‌కు ధీటుగా నిలిచే జగన్మోహన ప్యాలెస్‌ ప్రస్తుతం ఆర్ట్
గ్యాలరీ ,ఫంక్షన్ హాల్ గా మార్చబడింది..

జగన్మోహన్ ప్యాలెస్ :

చాముండేశ్వరి ఆలయం :
మైసూరు నగరానికి 13 కిలోమీటర్ల దూరంలో చాముండి బెట్టపై ఉన్న చాముండి అమ్మవారి ఆలయం దేశంలోని అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది.చాముండిదేవిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.ఆషాఢ మాసంలో భక్తుల రద్దీ గణనీయంగా ఉంటుంది.చాముండిదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జగద్విదిత మైసూరు దసరా ఉత్సవాలను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది..

చాముండేశ్వరి ఆలయం

 శ్రీ రంగనాథ స్వామి ఆలయం:
కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాలకు జీవనదిగా పేరుగాంచిన కావేరి నది ఒడ్డుపై శ్రీరంగపట్టణంలో నిర్మించిన రంగనాథ దేవాలయం రాష్ట్రంలోని ఐదు అతిముఖ్యమైన యాత్ర స్థలాల్లో ఒకటి.12వ శతాబ్దంలో హొయ్సళ రాజులు నిర్మించిన ఈ దేవాలయంలో శ్రీవిష్ణువు రంగనాథ అవతారంలో దర్ళనమిస్తాడు.

శ్రీ రంగనాథ స్వామి ఆలయం

సెయింట్ ఫిలోమోనా చర్చి:
సెయింట్ ఫిలోమోనా చర్చి ఒక కాథలిక్ చర్చ్ మరియు భారతదేశంలోని పురాతన చర్చిలలో ఒకటి.సెయింట్ ఫిలోమోనా చర్చి ఏషియాలో రెండో అతిపెద్ద చర్చిగా పరిగణించబడుతుంది.

సెయింట్ ఫిలోమోనా చర్చి

మైసూర్ జూ:
మైసూరు ప్యాలెస్‌కు అతి సమీపంలోనున్న మైసూరు జూ దేశంలోని ప్రధాన జంతు ప్రదర్శన శాలల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.వందల ఎకరాల్లో నిర్మించిన మైసూరు జూను మైసూరు రాజవంవస్థుడు దివంగత జయచామరాజేంద్ర జంతుప్రదర్శనశాలగా కూడా పిలుస్తుంటారు.దేశంలోని వన్యప్రాణులతో పాటు విదేశాల్లో మాత్రమే కనిపించే పలు రకాల వన్యప్రాణులను సైతం మైసూరు జూలో చూడొచ్చు..

మైసూర్ జూ

కారంజిలేక్:
దేశంలోనే అతిపెద్ద వాకింగ్‌ ట్రాక్‌ కలిగిఉన్న కారంజి లేక్‌ సీతాకకో చిలులకు ఉద్యానవనంగా కూడా గుర్తింపు పొందింది.సరస్సు మధ్యలో కృత్రిమంగా ఏర్పాటు చేసిన ఉద్యానవనంలో సీతాకోకచిలుకలు మాత్రమే కాకుండా అరుదైన హెరాన్స్‌,ఇగ్రెట్స్‌ తదితర పక్షులకు కూడా నివాసంగా మారింది.సరస్సులో ఏర్పాటు చేసిన ప్రకృతి మ్యూజియం తప్పకుండా చూడాల్సిందే..

కారంజిలేక్

కృష్ణ రాజా సాగర డ్యామ్ :
మైసూరు-మండ్య జిల్లాల మధ్య ప్రవహించే కావేరి నదిపై సర్‌.ఎం.విశ్వేశ్వరయ్య నైపుణ్యం రంగరించి నిర్మించిన కృష్ణరాజసాగర్‌ ఉరఫ్‌ కేఆర్‌ఎస్‌ జలాశయం కూడా పర్యటనలో చూడాల్సిన ప్రదేశం.దేశంలోని పది ప్రధాన జలాశయాల్లో కేఆర్‌ఎస్‌ జలాశయం కూడా ఒకటి.జలాశయాన్ని చూడడానికి వెళ్లే పర్యాటకులు కేఆర్‌ఎస్‌ఆనకట్టపై
ఉన్న మరో అద్భుతమైన ప్రదేశం బృందావన్గార్డెన్స్‌ తప్పకుండా చూడాల్సిందే..

కృష్ణ రాజా సాగర డ్యామ్

తలకాడు:
మైసూరు నగరం నుంచి 45 కిలోమీటర్ల దూరంలోనున్న తలకాడు హిందూ
దేవాలయాలలో ఒక మధురమైన యాత్ర స్థలం.ఎటు చూసిన ఇసుక తెన్నెలతో ఎడారిని తలపించే తలకాడులో చారిత్రాత్మక శివాలయాలు ఎంతగానో ఆకర్షిస్తాయి. తలకాడులో వైద్యనాథేశ్వర, పాతాళేశ్వర, మరుళేశ్వర,అరకేశ్వర,మల్లికార్జున శివాలయాలు ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు.ఐదు శివాలయాలపైకి పాతాళేశ్వర శివాలయం ఎంతో ప్రత్యేకమైనది.క్రీ.శ 1004లో గంగవంశ రాజులు నిర్మించిన పాతాళేశ్వర శివాలయంలో శివలింగం నేలమట్టం కంటే చాలా లోతులో ఉంటుంది. అంతేకాకుండా ఉదయం వేళల్లో ఎరుపు రంగులో,మధ్యాహ్నం వేళల్లో నల్లగా,సాయంత్రం వేళల్లో తెల్లగా కనిపించడం పాతాళేశ్వర శివాలయంలోని శివలింగం ప్రత్యేకత.

తలకాడు

మేల్కోటే:
మైసూర్ నుండి సుమారు 51 కి. మీ. దూరంలో ఉన్న మేలుకోటెను తిరునరాయణపురం అని కూడా పిలుస్తుంటారు.మేలుకోటే కర్నాటకలో పవిత్ర స్థలాలలో ఒకటి, ఇక్కడ యోగ నరసింహ స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది, ఇది యోగనరసింహ రాతి కొండలపై నిర్మించబడింది.

మేలుకోటె యోగ నరసింహ స్వామి ఆలయం

నంజన్ గూడ్:
కపిల నదీ తీరాన ఉన్న నంజనగూడును దక్షిణకాశీగా పిలుస్తుంటారు.నంజనగూడులోని శ్రీకంఠేశ్వర దేవాలయం రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది.దీంతోపాటు పలు రకాల అరటిపండ్లు,వంకాయలకు నంజనగూడు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

నంజనగూడు శ్రీకంఠేశ్వర దేవాలయం

శివన సముద్ర ఫాల్స్ :
మైసూరు నగరం నుంచి 85 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక-తమిళనాడు సరిహద్దుల్లోని చామరాజనగర జిల్లాలో ఉన్న శివనసముద్ర జలపాతం కర్ణాటక రాష్ట్రంలోని ప్రముఖ జలపాతాల్లో ఒకటి.కొండల మధ్యలో సుమారు 98 మీటర్ల ఎత్తు నుంచి దూకే జలపాతం తప్పకుండా చూడవలసిన ప్రదేశం.శివనసముద్రం ఏషియాలోనే మొదటి జల విద్యుత్తు పవర్ స్టేషన్లలో ఒకటిగా ప్రసిద్ది చెందినది.

శివన సముద్ర ఫాల్స్

బండీపుర్ నేషనల్ పార్క్:
కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేట తాలూకాలో సుమారు 850 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న బండీపుర జాతీయ ఉద్యానవనం అడవి ఏనుగులతో పాటు పులుల సంరక్షణ ప్రాంతంగా కూడా ప్రసిద్ధి చెందింది.సింహాలు,పెద్దపులులు,చిరుతలు,అడవి గేదెలు ఇలా ఎన్నో వన్యప్రాణులు,పలు రకాల పక్షులు,సరీసృపాలకు ఆశ్రయం కల్పిస్తోంది.బండీపుర ఉద్యానవనం అటు తమిళనాడు ఇటు కేరళ రాష్ట్రాల సరిహద్దులను పంచుకుటుంది..

బండీపుర్ నేషనల్ పార్క్‌లో వ్యాఘ్రరాజు గాంభీర్యం..

 

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos