దాడికి సిద్ధంగా మరో చైనా వైరస్..

దాడికి సిద్ధంగా మరో చైనా వైరస్..

దేశంలో ఇప్పటికే కరోనా వైరస్ వణికిపోయేలా చేస్తుంది. రోజుకు 80వేలు పైగా కరోనా పాజిటివ్ కేసులు వెయ్యికి పైగా మరణాలు నమోదవుతున్నాయి.అసలు కరోనా మహమ్మారి పేరు చెబితేనే ప్రజలు గజా గజా వణికిపోతున్నారు. ఈ క్రమంలో చైనా నుంచి వచ్చిన మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పుడున్న కరోనా మహమ్మారికే వ్యాక్సిన్ లేక అల్లాడిపోతుంటే ఇప్పుడు మరో వైరస్ చైనా నుండి భారత్ కి వ్యాపించింది అని చెప్పడంతో టెంక్షన్ మరికాస్తా పెరిగిపోయింది. చైనాలో మొదటగా కనుగొన్న క్యాట్ క్యూ వైరస్ ఆనవాళ్లు భారత్ లోనూ ఉన్నట్లు ఐసీఎంఆర్ గుర్తించింది. ఈ వైరస్ కారణంగా విపరీతమైన జ్వరం మెదడువాపు వ్యాధి మేదోమజ్జా రోగం వంటి వ్యాధులు భారత్లో సంక్రమించే ప్రమాదముందని భారత వైద్య పరిశోధనా మండలి హెచ్చరించింది.క్యాట్ క్యూ వైరస్ అర్బోవైరస్ జాతికి చెందినది. ఇది మనుషులతో పాటు జంతువులు మొక్కలపైనా ప్రభావం చూపుతుంది. చైనా వియత్నం దేశాల్లోని క్యూలెక్స్ దోమలు పందుల్లో ఈ వైరస్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఐసీఎంఆర్ అధ్యయనం ప్రకారం..CQV వైరస్ కు పందులు అతిథేయిగా ఉంటాయి. భారత్ లో ఎక్కువగా ఉండే ఏజిప్టి క్యులెక్స్ క్విన్క్విఫాసిటస్ క్యులెక్స్ ట్రిటనిరింకస్ దోమలు ఈ వైరస్ కు వాహకాలుగా పనిచేస్తాయి. ఈ దోమల ద్వారా CQV ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే ప్రమాదముందని ఐసిఎంఆర్ వెల్లడించింది.ఇప్పటికే భారత్ లో పందులు దోమల బెడద ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని ప్రజల నుంచి శాంపిల్స్ సేకరించి శాస్త్రవేత్తలు పరీక్షలు చేశారు. 883 మంది సీరం శాంపిల్స్ ను పుణెలోని NIV లో పరీక్షించగా.. ఇద్దరిలో క్యాట్ క్యూ వైరస్ యాంటీ బాడీలు ఉన్నట్లు బయటపడింది. శరీరంలో ఒక వైరస్ కు సంబంధించి యాంటీ బాడీలు ఉన్నాయంటే అతడికి ఆ వైరస్ సంక్రమించినట్లే లెక్క. వైరస్ సోకినందుకే దానిని ఎదుర్కొనేందుకు శరీరం యాంటీ బాడీలను తయారుచేసుకుందని అర్థం. ఈ లెక్కన మన దేశంలోకి క్యాట్ క్యూ వైరస్ ఎంట్రీ ఇచ్చిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కర్నాటక నుంచి ఆ ఇద్దరి శాంపిల్స్ను సేకరించారు. ఒకరిది 2014లో సేకరించగా. మరొకటిది 2017లో సేకరించారు. అయితే ఇద్దరి సీరమ్ శాంపిల్స్లో యాంటీ బాడీలు ఉన్నాయి కానీ.. వైరస్ మాత్రం లేదు. ప్రస్తుతం ఈ వైరస్ ఎంత మందిలో ఉన్నది తెలియాలంటే.. మరిన్ని శాంపిల్స్ తీసుకొని పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు తెలిపారు. మనుషులతో పాటు పందులు ఇతర జంతువుల శాంపిళ్లనూ సేకరిస్తామన్నారు. భారతీయ దోమల్లోని ఎఇ. ఎజిప్టి సిఎక్స్. క్విన్క్యూ ఫాసియాటస్ సిఎక్స్ ట్రిటానియోరైంకస్ అనే మూడు రకాల దోమలపై ఈ వైరస్ సంక్రమిస్తుందని తమ అధ్యయనంలో తేలినట్టు ఐసిఎంఆర్ వెల్లడించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos