హిందీ నేర్చుకుంటున్న అమెరికన్లు

హిందీ నేర్చుకుంటున్న అమెరికన్లు

వాషింగ్టన్‌: చక్కని భారతీయ సంస్కృతి, బాలీవుడ్‌ సినిమాల వల్ల అమెరికన్లు, విదేశీయులు హిందీ భాష పట్ల ఆకర్షితులవుతున్నారని, హిందీని నేర్చుకుంటున్నారని అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉన్న భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. దౌత్య కార్యాలయం ప్రారంభించిన ఉచిత హిందీ శిక్షణ తరగతుల కోసం 110 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది. వీరిలో భారత సంతతి వారు, అమెరికన్లతో పాటు యూకే, జర్మనీ, బ్రెజిల్‌, ఒమన్‌, ఉక్రెయిన్‌, బెలారస్‌, బంగ్లాదేశ్‌లకు చెందిన విద్యార్థులు ఉన్నారని భారత ఎంబసీ ఓ ప్రకటనలో తెలిపింది. హిందీ శిక్షణ తరగతులకు మంచి స్పందన వస్తోందని, దీంతో విద్యార్థులను రెండు తరగతులుగా విభజించి వారానికి రెండు సార్లు బోధిస్తున్నట్లు వెల్లడించింది.

హిందీ తరగతులకు వచ్చే విద్యార్థుల్లో 90శాతం మంది భారతీయులు కారని, వివిధ నేపథ్యాల నుంచి వచ్చారని భారత దౌత్య కార్యాలయంలోని మోక్షరాజ్‌ అనే ఉపాధ్యాయుడు తెలిపారు. శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, వ్యాపారస్థులు, యోగా బోధకులు, పరిశోధకులు తదితరులు హిందీ నేర్చుకునే వారిలో ఉన్నట్లు చెప్పారు. అయితే చాలా మంది బాలీవుడ్‌ సినిమాల పట్ల ఉన్న ఆసక్తితో, భారత సంస్కృతి సంప్రదాయాల పట్ల ఉన్న ఇష్టంతో హిందీ నేర్చుకుంటున్నారని తెలిపారు. మరికొందరు తమ జీవిత భాగస్వాములతో, స్నేహితులతో హిందీలో మాట్లాడేందుకు, భారత్‌కు వచ్చేందుకు, భారత్‌లో వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు హిందీ తరగతులకు వస్తున్నట్లు వెల్లడించారు. యోగా, వైదిక సంస్కృతిలో నిపుణులైన మోక్షరాజ్‌ను భారత ప్రభుత్వం గత ఏడాది వాషింగ్టన్‌కు పంపించింది. గత యోగా దినోత్సవం రోజున ఆయన వాషింగ్టన్‌లో వెయ్యి మందితో యోగా చేయించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos