సీబీఐ vs దీదీ: సీబీఐకి ఎదురుదెబ్బ

ఢిల్లీ: సుప్రీం కోర్టులో సీబీఐకి ఎదురుదెబ్బ తగిలింది. కోల్‌కతా‌ ఘటన నేపథ్యంలో తమ కేసును తక్షణ విచారణకు చేపట్టాలన్న సీబీఐ అభ్యర్థనను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తోసిపుచ్చారు. సీబీఐ అధికారుల అరెస్టుపై దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. సీబీఐ అధికారులను అన్యాయంగా అరెస్టు చేశారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు నివేదించారు. కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ లొంగిపోయేలా అదేశాలివ్వాలని కోరారు. విచారణ ఆధారాలను రాజీవ్ కుమార్ మరుగునపడేలా చేశారని వాదించారు. దీనిపై స్పందించిన సీజేఐ.. వాటికి ఆధారాలు ఉంటే చూపాలని సీబీఐని ఆదేశించారు. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నేడే విచారించాలని సొలిసిటర్ జనరల్ కోరగా.. ప్రధాన న్యాయమూర్తి నిరాకరించారు.
శారదా కుంభకోణం దర్యాప్తు నేపథ్యంలో కోల్‌కతాలో నిన్న రాత్రి నుంచి అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దర్యాప్తులో భాగంగా కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు ఆయన నివాసానికి వెళ్లగా.. వారిని పోలీసులు అడ్డుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో తాజా పరిణామాలను సీబీఐ అధికారులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చిట్‌ఫండ్‌ కేసులో పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం కోల్ కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్ కుమార్ తప్పుచేసినట్లు, సాక్ష్యాలు ధ్వంసం చేసినట్లు ఎటువంటి ఆధారాలు ఉన్నా 24 గంటల్లోగా తమ ముందు ఉంచితే మీరు కోరినట్లు ఆదేశాలు ఇస్తామని దేశ అత్యున్నత న్యాయ స్థానం సీబీఐకి స్పష్టం చేసింది. కమిషనర్ను విచారించేందుకు ఆదివారం కోల్‌కతా వెళ్లిన సిబీఐ అధికారులను అక్కడి పోలీసులు నిర్బంధించి ఆ తర్వాత విడిచిపెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దీక్షకు దిగడం, ప్రస్తుతం ఈ వివాదం నడస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ అధికారులను పశ్చిమబెంగాల్‌ పోలీసులు అరెస్టు చేశారంటూ సీబీఐ కేసు వేసింది. సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్‌ మెహతా వాదించారు. తమ కార్యాలయాన్ని కూడా అక్కడి ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ ఎదుట ప్రస్తావించారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందని న్యాయమూర్తి ప్రశ్నించగా తమ సిబ్బందిని వదిలేసినట్లు తెలిపారు. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ స్పందిస్తూ సిబ్బందిని వదిలేశాక కేసును అర్జంటుగా విచారించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఇక కోల్ కతా పోలీస్‌ కమిషనర్‌ విషయానికి వస్తే ‘మీ వద్ద ఒక్క ఆధారమైనా చూపించండి, మేము చాలా కఠినంగా స్పందిస్తాం. ఎంత కఠినంగా స్పందిస్తామంటే తామెంత తప్పుచేశామో అని వారు పశ్చాత్తాపపడే అంతంగా’ అని గొగోయ్‌ స్పష్టం చేశారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos