సీఎం సభ.. పిల్లాడి స్వెటర్‌ విప్పించారు

సీఎం సభ.. పిల్లాడి  స్వెటర్‌ విప్పించారు

న్యూదిల్లీ: నల్ల చొక్కాలు ధరించి ఆందోళనకారులు నిరసన చేపట్టడం చూస్తూనే ఉంటాం. అయితే అసోం ముఖ్యమంత్రి సొనోవాల్‌ హాజరవుతున్న ఓ సమావేశానికి నల్ల చొక్కాలు వేసుకురావద్దని పోలీసులు ఆంక్షలు విధించారు. కానీ.. ఓ మూడేళ్ల చిన్నారి ఆ రంగు స్వెటర్‌ ధరించి సభకు హాజరయ్యాడు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు ఆ స్వెటర్‌ విప్పేయాలని అతడి తల్లిని ఆదేశించారు. దీంతో ఆమె తన కుమారుడి స్వెటర్‌ను విప్పేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ ఘటన బిశ్వనాథ్‌ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానిక టీవీ ఛానళ్లలోనూ ఈ వీడియో ప్రసారమైంది. ముఖ్యమంత్రి ముందు నిరసన తెలుపుతాడని ఇలా చిన్న పిల్లాడి స్వెటర్‌ను బలవంతంగా విప్పేస్తారా? అంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. తన స్వెటర్‌ విప్పేయడంతో ఆ చిన్నారి భయపడిపోయి బిగ్గరగా ఏడ్చేశాడు.‘నా మూడేళ్ల చిన్నారి నల్ల రంగు స్వెటర్‌ వేసుకున్నాడు. దీంతో నా కుమారుడిని ఆ సమావేశానికి హాజరుకానివ్వబోమని భద్రతా సిబ్బంది అన్నారు. ఆ స్వెటర్‌ను విప్పేయాలని ఆదేశించారు’ అని ఆ చిన్నారి తల్లి మీడియాకు తెలిపింది. ‘ఆ చిన్నారికి చలి వేయకుండా అతడి తల్లి ఆ స్వెటర్‌ను వేసింది. కానీ, పోలీసులు దాన్ని విప్పేయాల్సిందేనని చెప్పారు. నల్లా చొక్కాలు నిరసనలు తెలపడానికి చిహ్నమని వారు భావిస్తున్నారు’ అని ఓ స్థానిక వ్యక్తి తెలిపాడు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పౌరసత్వ సవరణ బిల్లుపై అసోంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో సొనోవాల్‌ సమావేశాలకు నిరసనల సెగ తగిలే అవకాశం ఉండడంతో పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి హాజరవుతున్న సభలకు నల్ల చొక్కాలు వేసుకొస్తే వాటిని విప్పేయాల్సిందేనని, లేదంటే సభకు వెళ్లేందుకు వారికి అనుమతి ఇవ్వబోమని పోలీసులు ప్రజలకు చెబుతున్నారు. చిన్నారి స్వెటర్‌ను విప్పేసిన వీడియో వైరల్‌ కావడంతో ముఖ్యమంత్రి సొనోవాల్‌ దీనిపై దర్యాప్తు జరపాలని డీజీపీని ఆదేశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos