షర్మిల కేసులో వేగంగా వేట…

షర్మిల కేసులో వేగంగా వేట…

షర్మిల కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ప్రభాస్ తో తనకు ఎఫైర్ ఉన్నట్లు అసత్య కథనాలు అల్లుతున్నారంటూ సోషల్ మీడియా నిర్వాహకులపై షర్మిల ఇచ్చిన ఫిర్యాదుతో డొంక కదిలింది. ఈ మేరకు దాదాపు 15 యూట్యూబ్ ఛానళ్లను గుర్తించారు పోలీసులు. వారందరికీ నోటీసులు పంపించడమే గాకుండా అందులో ఐదుగుర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

అసత్య కథనాలతో తిప్పలు..
ప్రభాస్ తో తనకు సంబంధాలున్నాయంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదంటూ ఇటీవల మీడియా ముందుకొచ్చారు షర్మిల. కొందరు సోషల్ మీడియా నిర్వాహకులు లేనిపోనివి సృష్టించి తన గౌరవ మర్యాదలకు భంగం కలిగించారని ఆరోపిస్తూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో కొన్ని వీడియో లింకులను సైతం షర్మిల పోలీసులకు అందించినట్లు సమాచారం. షర్మిల ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు స్పీడప్ చేశారు. ఆమె కంప్లైంట్ మేరకు దాదాపు 15 మంది యూట్యూబ్ ఛానళ్లను గుర్తించారు. షర్మిలపై అసత్య ప్రచారం చేసినట్లుగా ఉన్న 60 వీడియోలను సేకరించడమే గాకుండా బాధ్యులపై చర్యలు ప్రారంభించారు.

నోటీసులు.. కేసులు..
షర్మిలపై అసత్య కథనాలు ప్రసారం చేస్తూ వీడియోలు రూపొందించిన యూట్యూబ్ నిర్వాహకులపై నిఘా పెంచారు పోలీసులు. దాదాపు 15 మంది యూట్యూబ్ నిర్వాహకులకు నోటీసులు పంపించారు. అయితే పోలీసుల దగ్గరకు రావడానికి ఇష్టపడని సదరు యజమానులు తమ దగ్గర పనిచేసే సిబ్బందిని పంపిస్తున్నారట. ఈ విషయంపై సీరియస్ అయిన పోలీసులు యజమానులే రావాలంటూ ఆదేశించారు. అయితే ఐదుగురు యూట్యూబ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు సీఆర్పీసీ 41 (a) కింద నోటీసులు కూడా జారీచేశారు. మరికొందరికి కూడా ఇలాంటి నోటీసులు పంపించేందుకు రెడీ అవుతున్నారు. దర్యాప్తు పూర్తయ్యాక ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసులు బుక్ చేయనున్నట్లు సమాచారం.
కామెంట్ చేసినోళ్లకు..!
సదరు యూట్యూబ్ ఛానల్స్ ప్రసారం చేసిన వీడియోలు చూసి కొందరు రెచ్చిపోయి కామెంట్లు పెట్టారు. అయితే వీడియో పోస్ట్ చేసిన వారితో పాటు కామెంట్లు పెట్టిన వారు కూడా ఈ కేసులో ఇరుక్కునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పోలీసుల దర్యాప్తు తీరు చూస్తే ఆ విషయం బోధపడుతుంది. కామెంట్లు పెట్టేవారి నిక్ నేమ్ తప్ప అక్కడ వారికి సంబంధించి ఎలాంటి వివరాలుండవు. దీంతో తాము దొరకబోమనే ధీమాతో ఉంటారు చాలామంది. కానీ షర్మిల కేసులో తీగ లాగి డొంక కదిలిస్తున్నారు పోలీసులు. కామెంట్లు పెట్టినవారి ఐడీలను గుర్తిస్తూ వారి లాగిన్, ఐపీ అడ్రస్ వివరాలు వెతికే పనిలో పడ్డారు. కొన్ని సందర్భాల్లో సదరు యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకుల నుంచే కామెంట్లు చేసిన వారి వివరాలు సేకరించనున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos