యువతికి ఫోన్‌ వేధింపులు.. బాలుడి అరెస్ట్‌

  • In Crime
  • January 22, 2019
  • 776 Views
యువతికి ఫోన్‌ వేధింపులు.. బాలుడి అరెస్ట్‌

గుర్తు తెలియని నంబరు నుంచి ఆ కుర్రాడికి మిస్డ్‌ కాల్‌ వచ్చింది.. తిరిగి చేయగా.. అవతలి నంబరు అమ్మాయిది కావడంతో.. పట్టుమని పద్దెనిమిదేళ్లు లేని ఆ బాలుడు అదేపనిగా ఫోన్‌ చేసి ఇబ్బందికరంగా మాట్లాడటంతోపాటు వాట్సప్‌లో అసభ్యకర చిత్రాల్ని పంపిస్తూ వేధింపుల్ని ముమ్మరం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. రాచకొండ ఏసీపీ హరినాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా వెలిగోడు మండలం మోత్కూరు గ్రామానికి చెందిన బాలుడి(17) చరవాణికి 2018 డిసెంబరులో మిస్డ్‌ కాల్‌ వచ్చింది. ఆ బాలుడు తిరిగి ఫోన్‌ చేయడంతో అవతలి వైపు అమ్మాయి మాట్లాడి పొరపాటున రాంగ్‌ డయల్‌ అయిందని చెప్పి పెట్టేసింది. అంతటితో ఊరుకోని బాలుడు తర్వాత ఆ నంబరుకు ఫోన్‌ చేయడం ఆరంభించాడు. ఆ అమ్మాయి అతడితో మాట్లాడేందుకు అంగీకరించకపోయినా పదేపదే చేస్తూ పోయాడు. చివరకు ఆమె అతడి ఫోన్లకు స్పందించడం మానేసింది. దీంతో కక్ష పెంచుకున్న బాలుడు అసభ్యకర చిత్రాల్ని ఆమె వాట్సప్‌ నంబర్‌కు పంపిస్తూ.. తన కోరిక తీర్చాలని వేధించసాగాడు. దీంతో బాధితురాలు రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసుల్ని ఆశ్రయించింది. ఆ విషయం తెలియడంతో అతడు తన చరవాణిలోనుంచి అసభ్యకర చిత్రాల్ని, సందేశాల్ని తొలగించాడు. దర్యాప్తు చేపట్టిన ఇన్‌స్పెక్టర్‌ డి.జలేంధర్‌రెడ్డి సోమవారం బాలుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos