మాయావతి హిజ్రా కన్నా అధ్వానం

మాయావతి హిజ్రా కన్నా అధ్వానం

చందౌలి(యూపీ): బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతిపై బీజేపీ ఎమ్మెల్యే సాధనా సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా యూపీలో ఎస్పీ–బీఎస్పీ పొత్తుపై ఆమె ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ..‘అధికారం కోసం గౌరవాన్ని వదులుకున్న మాయావతి తనపై దాడిచేసిన వారితోనే చేతులు కలిపారు. ఆమె ఆడజాతికే కళంకం లాంటిది. అసలు మాయావతి ఆడో, మగో చెప్పలేం. ఆమె హిజ్రా కంటే అధ్వానమైన వ్యక్తి’ అని దుర్భాషలాడారు.దీంతో ఈ వ్యాఖ్యలను సుమోటోగా విచారణను స్వీకరిస్తున్నట్లు జాతీయ మహిళా కమిషన్‌ చైర్మన్‌ రేఖ శర్మ తెలిపారు. నోటీసులు జారీచేస్తామన్నారు. మరోవైపు సాధనా సింగ్‌ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథావలే, ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్, బీఎస్పీ నేత ఎస్సీ మిశ్రా, కాంగ్రెస్‌ నేత ప్రియాంకా చతుర్వేది ఖండించారు. 1995లో లక్నోలోని ఓ గెస్ట్‌హౌస్‌లో బీఎస్పీ నేతలతో సమావేశమైన మాయావతిపై ఎస్పీ కార్యకర్తలు దాడి చేశారు.

న్యూఢిల్లీ : బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే సాధనాసింగ్ పై ఏడు క్రిమినల్ కేసులున్నాయని తేలింది. మొదటిసారి 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన సాధనా సింగ్ ఎన్నికల కమిషన్ కు సమర్పించిన నివేదికలో తన పై ఏడు క్రిమినల్ కేసులున్నాయని వెల్లడించారు. అల్లర్లు రేపారని, ఇతరుల వ్యక్తిగత భద్రతకు భంగం కలిగించడం, విధినిర్వహణలో ఉన్న అధికారులను అడ్డుకోవడం లాంటి 7 కేసులు సాధనాసింగ్ పై నమోదైనాయి. పదిహేనేళ్ల క్రితం రాజకీయాల్లోకి రాకముందు సాధనాసింగ్ చందౌలి వ్యాపారమండలి అధ్యక్షురాలిగా వ్యవహరించారు. అనంతరం చందౌలీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేశారు. 1997లో సాధనా సింగ్ సంపూర్ణానంద సంస్కృతి యూనివర్శిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు.2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొఘల్ సరాయి అసెంబ్లీ స్థానం నుంచి సాధనా పోటీ చేసి విజయం సాధించారు. ఎమ్మెల్యే అయిన రెండు నెలలకే సాధనా సింగ్ యూరోపియన్ కాలనీలో పరిశుభ్రత లోపించిందంటూ మొఘల్ సరాయి రైల్వే డీఆర్ఎంపై విరుచుకుపడ్డారు. తాను పిలిచినా డీఆర్ఎం రాలేదని ఆమె రైల్వే డీఆర్ఎం కార్యాలయం వద్ద తన మద్ధతుదారులతో ఆందోళన చేశారు. హిందీ భాషలో విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో మాయావతిపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్నట్లు చెప్పినా, మళ్లీ 1995 జూన్ 2 నాటి గెస్ట్ హౌస్ కేసులో మాయావతికి బీజేపీ సహాయం చేసిందనే విషయాన్ని సాధనాసింగ్ గుర్తు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos