మమతా బెనర్జీకి ‘జై’ కొట్టిన కుమారస్వామి

మమతా బెనర్జీకి ‘జై’ కొట్టిన కుమారస్వామి

కోల్‌కతా: నరేంద్ర మోదీ ప్రభుత్వ పనితీరుపై దేశ ప్రజలు అసంతృప్తితో ఉన్నారని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంచి పాలనాదక్షత కలిగిన నాయకురాలని, దేశాన్ని నడిపించే శక్తిసామర్థ్యాలు ఆమెకు ఉన్నాయని ప్రశంసించారు. అయితే, నాయకత్వం అనేది ఇప్పుడు ప్రధాన అంశం కాదన్నారు. ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలి, అందుకు అనుసరించ వలసి వ్యూహాలపైనే విపక్షాలు ప్రస్తుతం దృష్టిసారించాల్సి ఉంటుందని పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. ఎన్నికలకు ముందే నేతను ఎంపిక చేయాల్సిన అవసరం లేదనేది తన అభిప్రాయమని చెప్పారు. నరేంద్ర మోదీ పాలనాతీరుపై దేశ ప్రజలు పూర్తి అసంతృప్తితో ఉన్నారని, పలు రాష్ట్రాలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ‘సమర్ధవంతమైన నేతలు చాలామంది ఉన్నారు. దేశాభివృద్ధి కోసం వారు చాలా పెద్దఎత్తునే కృషి చేశారు. గత ప్రభుత్వాలు విఫలమైన చోట్ల వారు అభివృద్ధి చేసి చూపించారు’ అని అన్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాతే అంతా కలిసి మాట్లాడుకుని తమ నేతను ఎంపిక చేస్తారని చెప్పారు. కాగా, టీఎంసీ ఆధ్వర్యంలో శనివారం జరిగిన యునైటెడ్ ఇండియా ర్యాలీకి హాజరైన సయయంలోనూ అదే వేదిక నుంచి దేశాన్ని నడిపించే సామర్థ్యం మమతకు ఉందని కుమారస్వామి ప్రకటించారు. మమతా బెనర్జీ ఎంతో నిరాడంబర నేత అని, పాలనాదక్షురాలని, దేశాన్ని ఆమెను ముందుకు నడిపించగలరని తాను నమ్ముతున్నానని అన్నారు. పశ్చిమబెంగాల్‌కు ఎన్నో ఏళ్లుగా నాయకత్వం వహిస్తూ ఆమె తన సత్తా చాటుకుంటున్నారని ప్రశంసించారు. విపక్షాల పోరాటాన్ని మమత మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos