భారత ఎంబసీకి అనుమానాస్పద పార్సిల్స్‌

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలో అనుమానాస్పద పార్సిల్స్‌‌ కలకలం సృష్టించాయి. మెల్‌బోర్న్‌, కాన్‌బెర్రాలలోని దౌత్య, కాన్సులేట్‌ కార్యాలయాలకు అనుమానాస్పద పార్సిల్స్‌ వచ్చాయని అక్కడి ఫెడరల్‌ పోలీసులు వెల్లడించారు. భారత‌ దౌత్య కార్యాలయానికి కూడా ఈ పార్సిల్స్‌ వచ్చినట్లు సమాచారం. పార్సిల్స్‌ అంశాన్ని పరిశీలిస్తున్నామని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అత్యవసర సేవల విభాగం అధికారులు పార్సిల్స్‌ను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. తమ కార్యాలయానికి పార్సిల్‌ వచ్చినట్లు మెల్‌బోర్న్‌లోని బ్రిటిష్‌ హైకమిషన్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు. తమ సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.

మెల్‌బోర్న్‌లోని దాదాపు 9 దౌత్య కార్యాలయాలకు ఈ పార్సిల్స్‌ వచ్చినట్లు ఆస్ట్రేలియా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందులో అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, స్విట్జర్లాండ్‌, భారత రాయబార కార్యాలయాలు ఉన్నాయని చెప్తున్నాయి. అగ్నిమాపక, వైద్య సిబ్బంది మెల్‌బోర్న్‌లోని భారత, అమెరికా దౌత్య కార్యాలయాల వద్ద మోహరించిన ఫొటోలను అక్కడి మీడియా ఒకటి ప్రసారం చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos