భారతి సంతతి పోలీసుపై ట్రంప్‌ ప్రశంసలు

వాషింగ్టన్‌: ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియాలో దుండగుల కాల్పులకు బలైన భారత సంతతి పోలీసు అధికారి రొనిల్‌ సింగ్‌(33)పై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసలు కురిపించారు. ఆయన అమెరికా ‘నేషనల్‌ హీరో’ అని పొగిడారు. ఓ అక్రమ వలసదారుడి చేతిలో విధులు నిర్విర్తిస్తున్న యువ అధికారి ప్రాణాలు కోల్పోయిన రోజున అమెరికా గుండె పగిలినంత బాధపడిందని ట్రంప్‌ వెల్లడించారు. న్యూమన్‌ పోలీస్‌ విభాగానికి చెందిన రోనిల్‌ సింగ్‌ డిసెంబరు 26న ట్రాఫిక్‌ నియంత్రణకు సంబంధించిన విధులు నిర్వర్తిస్తుండగా అక్రమ వలదారుడు తుపాకీతో కాల్చి చంపేసి పారిపోయాడు. కాలిఫోర్నియా పోలీసులు తర్వాత నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

రొనిల్‌ మరణంపై ట్రంప్‌ సంతాపం వ్యక్తంచేశారు. మరణించిన అధికారి కుటుంబసభ్యులను, ఆయన తోటి ఉద్యోగులను ట్రంప్‌ ఇటీవల కలిసి మాట్లాడారు. వలసదారులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించడం వల్లే ఇలాంటి దారుణం జరిగిందని ట్రంప్‌ ఆరోపించారు. ఇక్కడ ఉండడానికి కూడా హక్కు లేని ఓ వ్యక్తి అమెరికా యువ అధికారి ప్రాణాలను తీశాడని ఆవేదన వ్యక్తంచేశారు. అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చిన వారి వల్ల ఎంతో అమూల్యమైన మన పౌరుల ప్రాణాలు పోతున్నాయని అన్నారు. అమెరికాలో పలు చోట్ల ఇలాంటి అక్రమ వలసదారుల వల్ల ఎన్నో నేరాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అందుకే మెక్సికోతో సరిహద్దుల్లో భద్రత కల్పించేందుకు గోడ నిర్మించాలని తాను పట్టుబడుతున్నట్లు ట్రంప్‌ చెప్పుకొచ్చారు. డెమోక్రాట్లు గోడ నిర్మాణానికి నిధులు కేటాయించనీయకపోవడం వల్లే అమెరికా షట్‌డౌన్‌ ఇంకా కొనసాగుతోందని అన్నారు. అయితే గోడ నిర్మాణం జరిగితేనే అక్రమ వలసలకు అడ్డుకట్ట పడుతుందని ట్రంప్‌ స్పష్టంచేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos