పవన్ నాన్చుడు వ్యవహారం.. ఎవరి కోసం?

సంక్రాంతి వెళ్లిపోయింది, కానీ పవన్ లో మాత్రం చలనంలేదు. పండగకు పార్టీ ఇంచార్జిలను ప్రకటిస్తానని గొప్పగా చెప్పిన జనసేనాని మళ్లీ ఆ ఊసెత్తలేదు. స్క్రీనింగ్ కమిటీ కూడా తమ పని పూర్తిచేసి పార్టీ అధినేతకు లిస్ట్ ఇచ్చేశామని చేతులు దులుపుకుంది. మరి పవన్ ఏం చేస్తున్నారు?జిల్లాల వారీగా సమీక్షలు జరపడంపై పెట్టిన శ్రద్ధ ఇంచార్జిలను ఎంపిక చేయడంలో మాత్రం చూపెట్టడం లేదు పవన్. ఈ విషయంలో తెరవెనక చంద్రబాబు సూచనల మేరకే పనిచేయాలని పవన్ నిర్ణయించుకున్నారని, అందుకే కమిటీల విషయంలో కాలయాపన చేస్తున్నారని ఓ వర్గం ఆరోపిస్తోంది.ఒంటరి పోరాటంపై పవన్ ఇంకా ముందూ వెనకా ఆలోచిస్తున్నారు. పవన్ మాట్లాడే ప్రతిమాటా, ఆయన వ్యవహార శైలి టీడీపీతో పొత్తు కోసం ఉవ్విళ్లూరుతున్నట్టే కనిపిస్తోంది. ఆమధ్య చంద్రబాబుపై కక్షతో జగన్, కేసీఆర్ కలసిపోయారనన్న పవన్, పొత్తుల కోసం బాబు ఆహ్వానం పంపించినప్పట్నుంచి ఆలోచనలో పడ్డారు. టీడీపీతో పొత్తుపై లాభనష్టాలు బేరీజు వేసుకుంటున్నారట.ఇందులో భాగంగానే నియోజకవర్గాల వారీగా ఇంచార్జిలను ప్రకటించే విషయంలో పవన్ ముందూ వెనకా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. పొత్తు విషయంలో క్లారిటీ వస్తే.. అప్పుడు తనకు కేటాయించిన సీట్లపై దృష్టి పెట్టొచ్చనేది పవన్ ఆలోచనలా కనిపిస్తోంది. అందుకే ప్రస్తుతానికి పవన్ సైలెంట్ అయిపోయారని సమాచారం.పవన్ నాన్చుడు బేరం జనసైనికుల్లో మాత్రం అసహనం కలిగిస్తోంది. ఇప్పటికే సమయం మించిపోతోంది, ఇకనైనా నియోజకవర్గాల పగ్గాలు సమర్థులకు అప్పగించకపోతే.. జనసేన ఎప్పటికీ వన్ మ్యాన్ ఆర్మీలాగా మిగిలిపోవాల్సి వస్తుందనేది వాళ్ల బాధ. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos