నవొయా షిగ

  • In Sahitya
  • January 16, 2019
  • 802 Views
నవొయా షిగ

జపాన్‌ కథకుడు, నవలా రచయిత నవొయా షిగ (1883– 1971). ఆయన తాత సమురై. తండ్రి బ్యాంకర్‌. తాత దగ్గరే ఎక్కువ పెరిగాడు. పదమూడేళ్లప్పుడు తల్లిని కోల్పోయాడు. తండ్రి వెంటనే పునర్వివాహం చేసుకున్నాడు. అప్పటినుంచీ తండ్రీకొడుకుల మధ్య సంబంధం క్షీణిస్తూ వచ్చింది. షిగ ప్రేమ వ్యవహారం తండ్రికి బాధ్యతారాహిత్యంగా కనబడింది. చదువు కూడా గొప్పగా సాగలేదు, దానికితోడు రచయిత అవుతానని కూర్చున్నాడు. ఇదంతా తండ్రికి చిర్రెత్తుకొచ్చింది. ఒక దశలో తండ్రి వారసత్వాన్ని రద్దు చేసుకుంటున్నట్టుగా ప్రకటించాడు. ఇద్దరూ కలవడమూ, విడిపోవడమూ ఆయన రచనల్లో ప్రతిఫలించింది.
తన అనుభవాలు, జ్ఞాపకాలు, అపరాధాంగీకారాలు, వీటన్నింటి కలబోతగా షిగ తనకే ప్రత్యేకమైన ‘ఐ–నావెల్‌’ (నేను–నవల) సాహిత్య ప్రక్రియకు పురుడు పోశాడు. ఆత్మకథాత్మకంగా సాగని, రచయిత తనను తాను వ్యక్తం చేసుకోని రచనల మీద షిగకు ఆసక్తి లేదు. రచన వాస్తవికంగా సాగాలి; అలాగని వివేచనలేని వాస్తవాలు ఏకరువుపెట్టుకుంటూ పోకూడదు. ఈ ధోరణిలోనే జీవితపు మౌలిక స్వభావాన్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు. అన్నింటికీమించి అప్రయత్నంగా రాసే ఆయన శైలి వల్ల జపాన్‌లో ఆయన మీద ఒక ప్రత్యేకమైన ఆరాధన మొదలైంది. ఎంతోమంది రచయితలు ఆయన్ని అనుకరించేందుకు విఫలయత్నం చేశారు. చిత్రంగా, తన రచనలు అందరికీ చేరాలనీ, ఎన్నో భాషల్లోకి అనువాదం కావాలనీ షిగ కోరుకోలేదు. సినిమాలకు ఇవ్వడానికి కూడా ఆసక్తి చూపలేదు. అంతెందుకు, సాహిత్యాన్ని జీవితానికి తక్కువరకపు ప్రత్యామ్నాయంగానే చూశాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos