దేశ వ్యాప్తంగా విధ్వంసం?: హాజి అహ్మద్

దేశ వ్యాప్తంగా విధ్వంసం?: హాజి  అహ్మద్

న్యూఢిల్లీ : అయోధ్య రామ జన్మభూమిలో వివాద రహిత భూమిని అసలు యజమానులకు తిరిగి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ కేసులో పిటిషనర్ హాజీ మెహబూబ్ మాట్లాడుతూ బీజేపీ ప్రస్తుత పరిస్థితి గురించి ప్రపంచమంతటికీ తెలుసునని, అందుకే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ చర్య తీసుకుందని ఆరోపించారు. ప్రభుత్వం రెండేళ్ళ క్రితం ఇటువంటి చర్య తీసుకుని ఉంటే ప్రజలు ఆమోదించేవారన్నారు. ఇదంతా పెద్ద ఆట అని తమకు తెలుసునన్నారు. ఇదే కానీ (వివాద రహిత స్థలాన్ని అసలు యజమానులకు అప్పగిస్తే) జరిగితే, యావత్తు దేశం భగ్గుమంటుందన్నారు. ఈ దేశాన్ని కాపాడేవాళ్ళు ఎవరూ ఉండరని గుర్తుంచుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అఫిడవిట్‌లో ‘‘భూ సేకరణ 1993లో జరిగిందని, 25 ఏళ్ళు గడిచిపోయిందని గౌరవప్రదంగా విన్నవిస్తున్నాం. అసలు భూ యజమానుల భూములు వివాద రహితమైనవి, ఇప్పటికీ సేకరణలో ఉన్నవి, వారికి తమ భూములను తిరిగి పొందడానికి హక్కు ఉంది. ఆ భూములను వారికి తిరిగి ఇవ్వడానికి, పునరుద్ధరించడానికి, తిరిగి అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం కర్తవ్యబద్ధత కలిగియుంది’’ అని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కేవలం 0.313 ఎకరాల్లో మాత్రమే బాబ్రీ మసీదు ఉందని తెలిపింది. దీనిపైనే వివాదం ఉందని పేర్కొంది. అంతకు మించిన, బయట ఉన్న ప్రాంతంపై యాజమాన్యం విషయంలో వివాదం లేదని తెలిపింది. వారి భూమిని సేకరణ నుంచి విడుదల చేయాలని తెలిపింది. సుప్రీంకోర్టు వద్ద విచారణలో ఉన్న అపీలుపై తీర్పు ప్రభావం ఈ దశలో ఈ వివాద రహిత భూమిపై ఏ విధంగానూ ఉండబోదని పేర్కొంది. ఈ భూమిని రామ జన్మభూమి న్యాస్‌కు, ఇతర యజమానులకు తిరిగి ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి అనుమతి ఇవ్వడంలో ఎటువంటి చట్టపరమైన అడ్డంకులు ఉండబోవని కూడా తెలిపింది. కోర్టు విచారణలో ఉన్న వివాదాస్పద భూమిపై తీర్పుకు అనుగుణంగా పార్టీలకు తగినవిధంగా హక్కులు కల్పించేందుకు కట్టుబడి ఉంటామని తెలిపింది. ప్రభుత్వం 1993లో 67.7 ఎకరాల స్థలాన్ని సేకరించింది. దీనిలో వివాద రహిత స్థలం దాదాపు 42 ఎకరాలు ఉందని ప్రభుత్వం చెప్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos