దుష్ప్రచారంలో జగన్‌ ఘనాపాఠి: చంద్రబాబు

దుష్ప్రచారంలో జగన్‌ ఘనాపాఠి: చంద్రబాబు

వైకాపా అధ్యక్షుడు జగన్ అహంభావం భరించలేకే అనేక మంది వైకాపాకు దూరమవుతున్నారని తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇంకా రూ.లక్షా 16వేల కోట్లు ఇవ్వాలని.. ఈ మేరకు ప్రధానికి లేఖ రాసినట్లు సీఎం చెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై అన్ని పార్టీలూ డిమాండ్‌ చేస్తున్నా భాజపా, వైకాపాలకు మాత్రం బాధ్యత లేకుండాపోయిందని చంద్రబాబు దుయ్యబట్టారు. తెదేపా నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. 

సానుకూల నాయకత్వానికి తెదేపా.. ప్రతికూల నాయకత్వానికి జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చెడు జరగాలి, అభివృద్ది ఆగిపోవాలి అనేదే వైకాపా పెడధోరణి అని.. దుష్ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ఘనాపాఠి అన్నారు. డబ్బుతో దేనినైనా కొంటాననేది జగన్ అహంభావమని సీఎం ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు దొంగ సర్వేలు జగన్‌కు అలవాటేనని.. ఆ సర్వేలతో  ప్రజాదరణను తారుమారు చేయలేరన్నారు. 2014 ఎన్నికల ముందు కూడా ఇదేవిధంగా తప్పుడు సర్వేలు చేశారని, ఫలితాల్లో తెదేపా ఘన విజయం సాధించిన విషయం గుర్తుచేశారు. ప్రజాభిమానాన్ని తెదేపాకి దూరం చేయడం అసాధ్యమన్నారు. కేంద్ర రాష్ట్రానికి రూ.85వేల కోట్లు ఇవ్వాలని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ కమిటీ తేల్చితే.. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ నేతృత్వంలోని జేఎఫ్‌సీ రూ. 75 వేల కోట్లు ఇవ్వాలని పేర్కొందని చంద్రబాబు గుర్తు చేశారు. ఏపీకి న్యాయం చేయాలని దేశం మొత్తం కోరిందని, పార్లమెంటులో 15 పార్టీలు కేంద్రాన్ని నిలదీశాయన్నారు. ఈ విషయంలో వైకాపా, భాజపాకి మాత్రం బాధ్యత లేదని.. రాబోయే ఎన్నికల్లో ఇరుపార్టీలకు గుణపాఠం తప్పదని ముఖ్యమంత్రి నేతలతో చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos