దక్షిణాదిపై కమలనాథుల గురి

దక్షిణాదిపై కమలనాథుల గురి

న్యూఢిల్లీ, జనవరి 28: భారత రాజకీయాలకు దక్షిణాది మరో ఉత్తర్‌ప్రదేశ్ కానున్నదా? ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరుస పర్యటనల ఆంతర్యమిదేనా? వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాదిలో వీలైనన్నీ ఎక్కువ సీట్లు గెలిచి తన సత్తా చాటాలని కమలనాథులు కదన కుతూహలంతో ఉన్నారా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే చెబుతున్నారు. గడిచిన రెండు వారాల్లో తమిళనాడులో వరుసగా రెండు సార్లు ప్రధాని నరేంద్రమోదీ పర్యటించడం, కేరళ పర్యటనకు ప్రధాని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తరుచూ వెళ్తుండడం ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నది.2014లో ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధిక స్థానాలు (మొత్తం 80 సీట్లలో 71) సాధించి కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకున్న బీజేపీ.. ఈ సారి యూపీలో తమ సీట్లకు భారీ గండిపడే అవకాశాలు ఉన్న దృష్ట్యా దక్షిణాది రాష్ర్టాలపై దృష్టిసారించింది. దక్షిణాదిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఉన్నాయి. వీటిలో మొత్తం 130 సీట్లు ఉన్నాయి. ఇందులో కర్ణాటకలో మాత్రమే బీజేపీ బలంగా ఉంది. గతంలో అధికారం కూడా చేపట్టింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలోని మొత్తం 28 స్థానాల్లో 18 చోట్ల బీజేపీ విజయం సాధించింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా అవతరించింది. మిగతా దక్షిణాది రాష్ర్టాల్లో మాత్రం బీజేపీ పరిస్థితి దారుణంగా ఉంది. గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఒక స్థానంలో గెలుపొందగా, తమిళనాడులో పొత్తు వల్ల రెండు చోట్ల విజయం సాధించింది. కేరళలో అసలు ఖాతానే తెరువలేదు. ఏపీతో తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకొని రెండు స్థానాల్లో గెలిచింది.ఈసారి తమిళనాడులో అధికార అన్నాడీఎంకేతో కలిసి బీజేపీ పోటీచేయనున్నట్లు విశ్లేషకుల అంచనా. గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 39 స్థానాల్లో 37 చోట్ల అన్నాడీఎంకే ఘన విజయం సాధించింది. మిగిలిన రెండు చోట్ల బీజేపీ గెలిచింది. ఇటీవల వరుసగా మోదీ తమిళనాడులో పర్యటిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. అయితే, తన ప్రసంగంలో ఆయన ఎక్కడ కూడా ప్రాంతీయ పార్టీలను పల్లెత్తు మాట కూడా అనడం లేదు. ప్రధానంగా కాంగ్రెస్, కమ్యూనిస్టులపైనే విమర్శనాస్ర్తాలు సంధిస్తున్నారు. ఇక, తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ స్థాపించిన పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ప్రధాని మోదీకి, రజనీకి సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు పొడిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.కేరళలో శబరిమల వివాదం బీజేపీకి కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి. అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఊపందుకున్నాయి. సుప్రీంకోర్టు తీర్పును అమలుచేసేందుకు అధికార ఎల్డీఎఫ్ ప్రయత్నించడం మెజార్టీ హిందువుల ఆగ్రహానికి కారణమైంది. ఈ పరిణామాలను ఆరెస్సెస్, వీహెచ్‌పీ, బీజేపీ తమకు అనుకూలంగా మల్చుకున్నాయన్న వాదనలు ఉన్నాయి. గతంలో ఎన్నడూలేనంతగా కేరళలో బీజేపీ బలపడిందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. హిందువుల ఓట్ల ఏకీకరణ దిశగా సంఘ్‌పరివార్ గట్టిగా కృషిచేస్తున్నది. ఇటీవల త్రిస్సూర్, తిరువనంతపురం, కొచ్చిల్లో వరుసగా పర్యటించిన మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టులపై తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ను గూఢచారి నెపంతో తీవ్ర అవమానాలకు గురిచేశారంటూ కాంగ్రెస్‌పైనా దుమ్మెత్తిపోశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos