చిన్నమ్మకు రాజభోగాలు.

చిన్నమ్మకు రాజభోగాలు.

ఐదు ప్రత్యేక గదులు వంట చేసేందుకు ఓ మనిషి సినిమాలు సీరియళ్లు చూసేందుకు ఓ టీవీ రుచికరమైన మాంసాహార భోజనం బట్టలు ఉతికేందుకు మరో వ్యక్తి వాకింగ్ చేసేందుకు విశాలమైన వరండా సన్నిహితులతో మాట్లాడేందుకు గంటల కొద్దీ సమయం… ఇవన్నీ ఏదైనా ఫైవ్ స్టార్ హోటల్ లోని ప్రత్యేక సదుపాయాలు అనుకుంటే పొరపడినట్లే! కానే కాదు. జైల్లో! ఔను. జైలు ఖైదీకి దక్కుతున్న మర్యాదలు ఇవి. ఆ ఖైదీ ఎవరో కాదు… ఇవన్నీ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ. చిన్నమ్మ కటకటాల్లో లభించిన వీఐపీ ట్రీట్ మెంట్ గురించి సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.జయలలిత నెచ్చెలి అయిన శశికళకు అక్రమాస్తుల కేసులో 2017లో న్యాయస్థానం నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెను కర్ణాటకలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. 2017 ఫిబ్రవరి 14న జైలులో శశికళ అడుగుపెట్టిన సమయంలో ఆమెకు కేవలం ఒక్క గది మాత్రమే కేటాయించారు. ఆ తర్వాత కొద్దికాలానికి ఆమెకు వీఐపీ ట్రీట్ మెంట్ దక్కింది. సమాచార హక్కు (ఆర్టీఐ) కార్యకర్త నరసింహమూర్తి దాఖలు చేసిన ఫిర్యాదుతో శశికళ జైలు సిత్రాలు వెలుగులోకి వచ్చాయి. ఆ నివేదికలోని వివరాల ప్రకారం శశికళ పక్కనే ఉన్న నాలుగు గదుల్ని ఖాళీ చేసి అందులోని మహిళా ఖైదీలను పక్క సెల్ లోకి పంపేశారు. ఆ తర్వాత మొత్తం ఐదు గదుల్ని శశికళకే కేటాయించారు. ఖైదీలకు ప్రత్యేకంగా వంట వండే నిబంధనలేవీ చట్టంలో లేవు. కానీ శశికళ కోసం అజంతా అనే మహిళా ఖైదీని ప్రత్యేకంగా వంట మనిషిగా నియమించారు. అవసరమైనప్పుడు బయటినుంచి మాంసాహార భోజనాన్ని తెప్పించి శశికళ సేవలో అధికారులు పోటీపడ్డారు. మరోవైపు శశికళను కలిసేందుకు నాయకులు అతిథులు పెద్దసంఖ్యలో నేరుగా ఆమె గదికి వెళ్లేవారని జైల్లోని సీసీటీవీ రికార్డుల్లో నమోదైంది. ఇందుకోసం ఐదు గదుల్లో ఒక దాన్ని మీటింగ్ రూమ్ గా మార్చారు. నిబంధనల ప్రకారం సందర్శకులతో కేవలం 45 నిమిషాలపాటు మాట్లాడే అవకాశం మాత్రమే ఉంటుంది. కానీ చిన్నమ్మ కోసం రూల్స్ ను పక్కనపెట్టేశారు. అతిథులతో ఆమె ఏకంగా 3-4 గంటలపాటు చర్చలు జరిపేవారని తేలింది.కాగా తాజాగా వెలుగులోకి వచ్చిన సంచలన అంశాల నేపథ్యంలో గతంలో శశికళకు జైల్లో వీఐపీ ట్రీట్ మెంట్ పై అప్పటి జైళ్ల శాఖ డీఐజీ డీ రూప సంచలన ఆరోపణలు వాస్తవమని తేలింది. . జైలు ఉన్నతాధికారులు రూ. 2 కోట్ల వరకు లంచాలు తీసుకుని శశికళకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారంటూ 2017 జూలై 12న ఆమె మీడియాకెక్కడం కలకలం రేపింది. ఆమె నేరుగా జైళ్లశాఖ డీజీ (ప్రిజన్స్) హెచ్ ఎన్ సత్యనారాయణరావు పైనే ఆరోపణలు చేశారు. దీంతో అప్పటి సిద్దరామయ్య ప్రభుత్వం హుటాహుటిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ నేతృత్వంలో కమిటీని నియమించింది. ఈ కమిటీ 2017 నవంబర్ 17న తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. శశికళకు జైల్లో రాజభోగాలు కల్పించిన విషయం వాస్తవమేనని కమిటీ విచారణలో తేలింది. అయితే ఈ నివేదికను ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. తాజాగా ఆర్టీఐ కార్యకర్త నరసింహమూర్తి ఈ 295 పేజీల రిపోర్టును సంపాదించారు. మరోవైపు వినయ్ కుమార్ కమిటీ రిపోర్టును ప్రస్తుతం హోంగార్డులు సివిల్ డిఫెన్స్ ఐజీపీ పనిచేస్తున్న రూప స్వాగతించారు. గతంలో తాను చేసిన ఆరోపణల్ని కమిటీ వాస్తవమేనని పేర్కొనడం తనకు సంతోషాన్నిచ్చిందని చెప్పారు. అయితే ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకుంటుందేమోనని ఆమె వ్యాఖ్యానించారు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos