కిడారి సందీప్‌ కుమార్‌కు డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

కిడారి సందీప్‌ కుమార్‌కు డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు రెండో కుమారుడు కిడారి సందీప్ కుమార్‌కు డిప్యూటీ కలెక్టర్‌ (గ్రూప్‌-1) ఉద్యోగం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డైరెక్ట్‌ రిక్రూటీగా కేటగిరీ-2లో డిప్యూటీ కలెక్టర్‌గా ఆయనకు ఉద్యోగం ఇచ్చారు. 2007 నుంచి 2009 వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా చేసిన కిడారి సర్వేశ్వరరావు, ఆ తర్వాత వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో అరకులోయ నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. సుమారు 33 వేల ఓట్ల తేడాతో గెలుపొందిన ఆయన రెండేళ్లు ఆ పార్టీలో ఉండి 2016లో టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన సివేరి సోమతో కలిసి 23-09-2018న గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ క్రమంలో వారిద్దరినీ మావోయిస్టులు బంధించి కిరాతకంగా హతమార్చారు. దీంతో మిత్రులిద్దరూ కలిసే మృత్యువు ఒడికి చేరారు. వారి కుటుంబాలను ఆదుకుంటానని ఆనాడే ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. కిడారి పెద్ద కుమారుడు శ్రావణ్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కిడారి సర్వేశ్వరరావు రెండో కుమారుడు సందీప్‌కు గ్రూప్-1 ఉద్యోగం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  

తాజా సమాచారం