కార్మికుల సమ్మె.. హెల్మెట్లతో బస్సు డ్రైవర్లు హౌరాలో పాఠశాల బస్సుపై ఆందోళనకారుల దాడి

దిల్లీ: కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, ఏకపక్ష కార్మికచట్టాల సంస్కరణలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మె రెండో రోజైన బుధవారం కొనసాగుతోంది. కేరళ, పశ్చిమ్‌బంగా రాష్ట్రాల్లో సమ్మె ప్రభావం ఎక్కువగా ఉంది. బంద్‌ నేపథ్యంలో కేరళలో 4,500 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ముంబయి పౌరరవాణా విభాగానికి చెందిన ఉద్యోగులు సమ్మె చేయడంతో ప్రజారవాణాకు అంతరాయం ఏర్పడింది. కర్ణాటకలో బస్సులపైకి నిరసనకారులు రాళ్లు రువ్వారు.

అటు పశ్చిమ్‌బంగాలోని కొన్ని చోట్ల ఆందోళనకారులు విధ్వంసాలకు పాల్పడుతున్నారు. కోల్‌కతాలో కార్మికులకు మద్దతుగా సీపీఎం కార్యకర్తలు, నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. హౌరాలో ఓ స్కూల్‌ బస్సుపై నిరసనకారులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. జాదవ్‌పూర్‌లో పోలీసులు, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.

మరోవైపు కార్మికుల ఆందోళనల దృష్ట్యా బస్సు డ్రైవర్లు హెల్మెట్లు ధరించాలని పశ్చిమ్‌బంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ దాదాపు పది కేంద్ర కార్మిక సంఘాలు రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి. కార్మికుల సమ్మెకు రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు, ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగుల సంఘాలు, దేశవ్యాప్తంగా రైతులు కూడా మద్దతు పలికారు. కార్మికుల సమ్మెకు మద్దతుగా జనవరి 8,9 తేదీల్లో తాము సమ్మె చేపట్టనున్నట్లు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ప్రకటించాయి. దీంతో కొన్ని చోట్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలకు అంతరాయం కలగనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos