కాపు రిజర్వేషన్లపై ఆపార్టీల వైఖరేంటి: చంద్రబాబు

కాపు రిజర్వేషన్లపై ఆపార్టీల వైఖరేంటి: చంద్రబాబు

చేతకాని వారు ఆంధ్రప్రదేశ్ ‌రాష్ట్రంలో అధికారంలో ఉండాలనేది తెలంగాణ సీఎం కేసీఆర్‌ కోరిక అని తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. తెలంగాణలో తన చేతకానితనం ఎక్కడ బయటపడుతుందో అని కేసీఆర్‌ భయపడుతున్నారని సీఎం వ్యాఖ్యానించారు. త్వరలో వైకాపా అధ్యక్షుడు జగన్ గృహ ప్రవేశానికి కేసీఆర్ ముఖ్యఅతిథిగా వస్తుండటాన్ని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ‘ఎలక్షన్‌ మిషన్‌-2019’లో భాగంగా తెదేపా నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.

కేసుల మాఫీ కోసం మోదీతో.. డబ్బు కోసం కేసీఆర్‌తో..

భాజపా కాపు రిజర్వేషన్లను నిందిస్తుంటే.. వైకాపా కూడా వాటిని అడ్డుకుంటోందని చంద్రబాబు మండిపడ్డారు. దీనిపై ఇరుపార్టీల వైఖరేంటో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. రిజర్వేషన్లపై రాష్ట్రానికి అధికారం లేదంటున్నారని.. తాము కాపులకు 5శాతం రిజర్వేషన్లు ఇస్తే ఆ రెండు పార్టీలకు కలిగిన బాధేంటో చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఏదీ జరగకూడదు.. ఎవరూ సంతోషంగా ఉండకూడదనేది భాజపా, వైకాపా లక్ష్యమని దుయ్యబట్టారు. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేదే ఇరు పార్టీల ఉమ్మడి అజెండా అని ఆయన ఆరోపించారు. కాపు రిజర్వేషన్లపై పాదయాత్రలో జగన్‌ను నిలదీస్తే తన పరిధిలోనిది కాదని తప్పించుకున్నారని.. ఇప్పుడు వారికి 5 శాతం ఇస్తుంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ ప్రశ్నించారు. భాజపా, వైకాపాలకు ప్రజలే బుద్ధి చెబుతారని నేతలతో ఆయన అన్నారు. కేసుల మాఫీ కోసం జగన్.. ప్రధాని మోదీతోనూ, డబ్బుల కోసం కేసీఆర్‌తోనూ రాజీపడి తెరాసకు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని దుయ్యబట్టారు. డబ్బు మనిషైన జగన్‌.. డబ్బున్న వాళ్లకే టిక్కెట్లు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. మోసాల్లో ఘనుడు కాబట్టే 16నెలలు జైలుకు వెళ్లారని, దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీనేతలకు ఆయన దిశానిర్దేశంచేశారు.

వ్యవస్థలను కాపాడుకోవడమే ఉమ్మడి అజెండా

ఏపీలో తెదేపాతో పొత్తు ఉండదని కాంగ్రెస్‌ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌ఛార్జి ఊమెన్‌ చాందీ నిన్న స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కూడా పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్‌తో పొత్తు లేదన్న సంకేతాలు ఇచ్చారు. రాష్ట్రాలలో స్థానిక పార్టీల అభీష్టం మేరకే ఎన్నికల్లో పోటీ ఉంటుందని.. జాతీయస్థాయిలో భాజపాకు వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పారు. పశ్చిమ్‌ బంగలో‌ కాంగ్రెస్‌, తృణమూల్ కాంగ్రెస్‌ మధ్య పొత్తు లేదని.. అయినా కాంగ్రెస్‌ నేతలు కోల్‌కతా ర్యాలీకి వచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు. నిరంకుశ పాలన అంతమే కామన్ మినిమం ప్రోగ్రామ్‌గా ముందుకు సాగుతున్నట్లు ఆయన వివరించారు. దేశంలోని వ్యవస్థలను కాపాడుకోవడమే ఉమ్మడి అజెండా అని స్పష్టంచేశారు. సేవ్ నేషన్, సేవ్ డెమోక్రసీ, యునైటెడ్ ఇండియా పేరుతో బెంగళూరు, కోల్‌కతాలో ఒకే వేదికపైకి వచ్చామన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడమే 23 భాజపాయేతర పార్టీల అజెండా అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల భద్రతే తమ ఉమ్మడి లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos