కన్నడ డ్రామాకు తెర…బీజేపీకి షాక్

కన్నడ డ్రామాకు తెర…బీజేపీకి షాక్

భారతీయ జనతాపార్టీకి మరోమారు శృంగభంగం అయింది. అధికారం కైవసం చేసుకోవాలని ఆ పార్టీ చూసిన ఎదురుచూపులు ఫలించలేదు. కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సద్దుమణుగుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు పలువురు బెంగళూరుకు చేరుకున్నారు. పార్టీకి విధేయులమని ప్రకటించారు. దీంతో హెచ్ డీ కుమారస్వామి సారథ్యంలోని జేడీఎస్-కాంగ్రెస్ కూటమి సర్కార్ కు పొంచి ఉన్న ముప్పు తొలిగినట్లేనని భావిస్తున్నారు. పార్టీలో అసమ్మతి పెరిగిపోతున్నదన్న వార్తల నేపథ్యంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది.

ఢిల్లీ నుంచి బెంగళూరుకు వచ్చిన బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బీఎస్ యెడ్యూరప్ప.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు తాము ప్రయత్నించడం లేదని పేర్కొన్నారు. కొద్ది రోజులుగా గుర్ గ్రామ్ లోని రిసార్ట్ లో బస చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు కూడా బెంగళూరుకు చేరుకున్నారు. తన ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బీజేపీ నిరర్ధక ప్రయత్నాలు చేస్తున్నదని సీఎం హెచ్ డీ కుమారస్వామి ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు గుర్ గ్రామ్ లో క్యాంప్ రాజకీయాలు నడిపిందని మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు తాను ప్రయత్నించానన్న ఆరోపణలను కుమారస్వామి తోసిపుచ్చారు. బీజేపీ చేయాల్సిందంతా చేస్తూ తమపై ఎదురుదాడికి దిగుతున్నదని ఆరోపించారు.ఇదిలాఉండగా కాంగ్రెస్ పార్టీ తన బల ప్రదర్శనకు సీఎల్పీ భేటీని వేదికగా మార్చుకోనుంది. తద్వారా జేడీఎస్- కాంగ్రెస్ సంకీర్ణకూటమిని కూలదోసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవన్న సంకేతాలివ్వనున్నది. శుక్రవారం జరిగే సీఎల్పీ భేటీకి సభ్యుల గైర్హాజరును తీవ్రంగా పరిగణిస్తామని ఎమ్మెల్యేలకు పంపిన నోటీసులో సీఎల్పీ నేత సిద్దరామయ్య పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని కూల్చాలనే బీజేపీ ప్రయత్నం ఫలితం లేదని ఆయన అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos