ఏపీని ఉద్ధరించినట్లు మాట్లాడుతున్నారు: చంద్రబాబు

ఏపీని ఉద్ధరించినట్లు మాట్లాడుతున్నారు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ అభివృద్ది భాజపా వల్ల జరగలేదని, తమ స్వయంకృషితోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. నాలుగేళ్లలో ఏపీ అభివృద్ధి ఘనత తెదేపాదేనని స్పష్టం చేశారు. ఎలక్షన్ మిషన్ 2019పై పార్టీ నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 25న రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ‘పసుపు-కుంకుమ’ సభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అమరావతి, విశాఖ, కడపలో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. మంత్రివర్గం సమావేశంలో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని.. వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. కూటమికి నలుగురు ప్రధానులని అనడం భాజపాలో భయానికి నిదర్శనమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కోల్‌కతా సభతో భాజపా నేతలు బెంబేలెత్తుతున్నారన్నారు. 

ఏపీని ఉద్ధరించినట్లు మాట్లాడుతున్నారు

ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువ నిధులు ఇచ్చామంటూ కేంద్ర మంత్రి గడ్కరీ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని సీఎం చెప్పారు. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌కే ఎక్కువ నిధులు కేటాయించారన్నారు. ఒక్క బుల్లెట్ రైలు ప్రాజెక్టుకే రూ.లక్ష కోట్లకుపైగా కేటాయించారని చంద్రబాబు ఆరోపించారు. ఏపీకి ఇచ్చినవన్నీ టోల్ పెట్టి వసూలు చేసే రోడ్లేనని.. ఏదో ఏపీని ఉద్ధరించినట్లు భాజపా నేతలు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పోలవరం నిర్మాణంలో జాప్యం చేస్తున్నారని, డీపీఆర్‌-2 ఆమోదంలో ఏడాది జాప్యానికి గడ్కరీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏ రాష్ట్రానికైనా ప్రధాని మోదీ అంగీకారంతోనే నిధులు కేటాయిస్తున్నారని సీఎం మండిపడ్డారు.

ప్రజాస్వామ్యంలో అనుమానాలకు తావులేదు

ఈవీఎంలపై అంతర్జాతీయంగా సైబర్ నిపుణుల హెచ్చరికల అంశాన్ని నేతల వద్ద చంద్రబాబు ప్రస్తావించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ ఎలా చేయవచ్చో రుజువులు చూపారని, ప్రజాస్వామ్యంలో అనుమానాలకు తావులేదన్నారు. ఓటు ఎవరికి పడిందనే సంశయం ఉండకూడదన్నారు. సంశయాత్మక ప్రజాస్వామ్యం చేటుదాయకమని చెప్పారు. తెదేపా పోరాటం వల్లే వీవీప్యాట్ రశీదులు అమల్లోకి తెచ్చారన్నారు. వీవీప్యాట్ కూడా 100 శాతం నియోజకవర్గాల్లో అమలు చేయడం లేదని.. దీనిపై జాతీయస్థాయిలో చర్చిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. 22 పార్టీల ప్రతినిధులతో త్వరలోనే ఈసీని కలుస్తామని సీఎం వివరించారు. 120 దేశాల్లో ఈవీఎంలను అమలు చేయడం లేదని.. కేవలం 20దేశాల్లోనే ఈవీఎంల వినియోగం ఉందని చెప్పారు. ఈవీఎంలపట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, వాటిపై అవగాహన పెంచుకోవాలని నేతలకు చంద్రబాబు సూచించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos