ఎన్సీపీలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి

ఎన్సీపీలో  గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి

అహ్మదాబాద్: కాంగ్రెస్, బీజేపీలకు దూరంగా కొత్త రాజకీయ ఇన్నింగ్స్‌‌ను ప్రారంభించనున్నట్టు ఇటీవల ప్రకటించిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా మంగళవారంనాడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)లో చేరారు. ఎన్సీపీ కండువా కప్పుకున్నారు. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ సమక్షంలో ఆయన చేరిక జరిగింది. ప్రజాసమస్యలు లేవనెత్తాలంటే ఒక మంచి వేదిక ఉండాలని, ఇదే విషయమై శరద్ పవార్‌తో చర్చించినప్పుడు ఆయన తనను పార్టీలోకి ఆహ్వానించినట్టు వాఘేలా తెలిపారు. కాగా, ఎన్సీపీలోకి వాఘేలాను చేర్చుకోవడం గుజరాత్‌ లోక్‌సభ ఎన్నికల్లో కీలకం అవుతుందని ఎన్సీపీ పార్టీ భావిస్తోంది. ఎన్‌సీపీ, కాంగ్రెస్ మధ్య ఒకవేళ పొత్తు కుదరని పక్షంలో గుజరాత్‌లో ఎన్‌సీపీ కొన్ని లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. త్రిముఖ పోటీకి సిద్ధమవుతుంది. వాఘేలా 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టారు. వెంటనే ఆయన బీజేపీలో చేరుతారని అనుకున్నప్పటికీ ఆయన అటు మొగ్గుచూపకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులను బరిలోకి దింపారు. అయితే వారంతా ఓటమి పాలయ్యారు. ఓబీసీ నేత అయిన వాఘేలా తొలుత బీజేపీలో చేరి తన రాజకీయ కెరీర్‌ను ప్రారంభించారు. 1995లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే వాఘేలాకు బదులుగా కేశూభాయ్ పటేల్‌ను బీజేపీ ముఖ్యమంత్రిని చేసింది. దీంతో పార్టీలో చీలికకు వ్యూహరచన చేసి కాంగ్రెస్ బయట నుంచి ఇచ్చిన మద్దతుతో 1996లో ఆయన సీఎం అయ్యారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంతో జౌళి శాఖ మంత్రిగా చేశారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే వాఘేలా గుజరాత్ అసెంబ్లీలో విపక్ష నేతగా, పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు.

                    

తాజా సమాచారం

Latest Posts

Featured Videos