ఆ రైతు రాజయ్యాడు!

ఆ రైతు రాజయ్యాడు!

చండీగఢ్‌: మనసు పెట్టి వ్యవసాయం చేయాలే గానీ.. అదెంత గొప్ప లాభసాటిదో నిరూపిస్తున్నారు హరియాణాకు చెందిన విద్యావంతుడైన ఓ రైతు. పీజీ చేసి మంచి ఉద్యోగం సంపాదించినా అది ఆయనకు తృప్తినివ్వలేదు. మొక్కలపై తనకున్న అమితమైన మక్కువతో ఉద్యోగాన్ని వదిలేశారు. దీన్ని చాలామంది తప్పు పట్టినా లెక్క చేయకుండా పట్టుదలతో ముందుకెళ్లారు. ఓ చిన్న నర్సరీని ప్రారంభించి దాన్ని పెద్ద పరిశ్రమ స్థాయికి చేర్చారు. నేడు అది 14 ఎకరాల్లో విస్తరించి దేశంలోనే అతిపెద్ద నర్సరీగా గుర్తింపు పొందింది. దేశ, విదేశాలకు ఏటా ఆయన 10 కోట్ల మొక్కలను సరఫరా చేస్తున్నారు. వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఆయన సాధించిన ఘనతకు గాను భారత ప్రభుత్వం కూడా గౌరవించింది. ఆయన ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తి. ఇదీ హర్బీర్‌ సింగ్‌ విజయగాథ. ఎం.ఎ. పూర్తిచేసిన ఆయన 1995లో దద్లూ గ్రామంలో తొలుత నర్సరీ ప్రారంభించారు. విజయవంతంగా నడుస్తున్న పలు నర్సరీలను చూసి ఎంతో నేర్చుకున్నారు. కొనేళ్ల కృషి ఫలితంగా 2004 నుంచి ఆయన నర్సరీ మూడు పువ్వులు, ఆరు కాయలుగా అభివృద్ధి చెందింది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే కూరగాయల మొక్కలను కొనుగోలు చేయడానికి హరియాణా, యూపీ, హిమాచల్‌ప్రదేశ్‌ తదితర ఎన్నో రాష్ట్రాల నుంచి రైతులు ఎగబడుతుంటారు. డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో పోటీపడి ముందస్తుగా డబ్బులిచ్చి వెళుతుంటారు. మొక్కల పెంపకంలో ఆధునిక పద్ధతులు పాటించడం వల్లే ఇలాంటి ఉత్పత్తి సాధ్యమైందని హర్బీర్‌ చెబుతున్నారు. ఈ నర్సరీకి అనేక ప్రత్యేకతలున్నాయి. ఇక్కడ మొక్కలన్నీ స్వదేశీ పద్ధతుల్లోనే ఉత్పత్తి చేస్తారు. నీటి అవసరం లేకుండా 3 నెలలు బతికే మొక్క వంగడాన్ని కూడా హర్బీర్‌ సృష్టించారు. మొక్కలను చాలా తక్కువ ధరకు రైతులకు అందించడం మరో విశేషం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos