బడ్జెట్ ప్రసంగం ప్రారంభం

బడ్జెట్ ప్రసంగం ప్రారంభం

 
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌ను పీయూష్ గోయల్ శుక్రవారం లోక్‌సభకు సమర్పించారు. ప్రస్తుతం అమెరికాలో చికిత్స పొందుతున్న అరుణ్ జైట్లీ సత్వరమే కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అరుణ్ జైట్లీ ఆయురారోగ్యాలతో సుదీర్ఘకాలం దేశానికి సేవ చేయాలని, ఆయన ఆరోగ్యం సత్వరమే కుదుటపడాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీనికి సభ యావత్తు సంఘీభావం ప్రకటించింది. నాలుగున్నరేళ్ళలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశాన్ని ముందంజలో నడిపిందని చెప్పారు. యూపీయే హయాంలో 10.9 శాతం ఉన్న ద్రవ్యోల్బణాన్ని తమ ప్రభుత్వం తగ్గించిందని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఆరో స్థానంలో ఉందని చెప్పారు. ద్రవ్యలోటును 3.4 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ మళ్ళీ గాడిలో పడిందన్నారు. ఆర్థిక మంత్రిగా రెండోసారి తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన గోయల్‌.. బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. గత ఐదు సార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అరుణ్‌జైట్లీ ప్రస్తుతం అనారోగ్య కారణాల రీత్యా అమెరికాలో చికిత్స తీసుకుంటుండంతో గోయల్‌ బడ్జెట్‌ ప్రసంగం చేస్తున్నారు. ఈ సందర్భంగా పీయూష్‌ గోయల్‌ నేపథ్యం ఓసారి చూద్దాం..అటల్‌ బిహారీ వాజ్‌పేయీ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన వేద్‌ ప్రకాశ్‌ గోయల్‌ కుమారుడే పీయూష్ గోయల్‌. 1964 జూన్‌ 13న గోయల్‌ జన్మించారు. ముంబయిలోని మతుంగాలో పాఠశాల విద్యను పూర్తిచేసిన గోయల్‌.. సీఏగా ఆల్‌ఇండియా రెండో ర్యాంక్‌ సాధించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి భాజపాలో చేరారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బోర్డుల్లో ప్రభుత్వ నామినీ సభ్యుడిగా పనిచేశారు.భాజపాలో అనేక కీలక పదవులు చేపట్టారు. 2016లో మహారాష్ట్ర నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. విద్యుత్‌, బొగ్గు, గనుల శాఖలకు సహాయమంత్రిగా వ్యవహరించారు. 2017 సెప్టెంబరు 3న గోయల్‌ రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

రెండుసార్లు ఆర్థిక మంత్రిగా..

పీయూష్‌ గోయల్‌ ఆర్థిక మంత్రిగా తాత్కాలిక బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. గతేడాది మే నెలలో అరుణ్‌జైట్లీ కిడ్నీ సంబంధిత శస్త్రచికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో గోయల్‌కు ఆర్థికశాఖ బాధ్యతలు అప్పగించారు. 2018 మే నుంచి ఆగస్టు వరకు ఆయన ఈ పదవిలో కొనసాగారు. ఇటీవల జైట్లీ మరోసారి అనారోగ్యానికి గురై చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. దీంతో గోయల్‌ మళ్లీ తాత్కాలిక ఆర్థికమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఈ హోదాలో నేడు లోక్‌సభలో తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఆఖరి బడ్జెట్‌ ఇదే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇది తాత్కాలిక బడ్జెట్‌ అయినప్పటికీ వ్యవసాయ రంగానికి, మరికొన్ని రంగాలకు మేలు జరిగేలా కేటాయింపులు ఉండనున్నట్లు సమాచారం. సాధారణంగా ఓట్ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో సార్వత్రిక ఎన్నికల లోపు ప్రభుత్వ ఖర్చులకు సంబంధించిన కేటాయింపులు మాత్రమే ఉంటాయి. కానీ ఈసారి తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లో కొన్ని పథకాలు, కేటాయింపులు ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే తాత్కాలిక బడ్జెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకోవడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో కూడా ఇలాంటివి జరిగాయి. ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం 2014-15 ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో కీలక ప్రకటనలు చేశారు. అప్పటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సాధారణ బడ్జెట్‌ వరకు వేచి చూడలేమని, పరోక్ష పన్నుల విధానంలో పలు మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. దానివల్ల ఆటోమొబైల్స్‌, మొబైల్‌ ఫోన్స్‌, ఇండస్ట్రియల్‌ ఆయిల్స్‌పై సుంకాలు తగ్గాయి. అలాగే బియ్యం లోడ్‌ చేయడం, దించడం, ప్యాకింగ్‌, నిలువ చేయడంపై సేవా పన్ను మినహాయించాలని ప్రతిపాదించారు. అంతేకాకుండా రక్షణ బలగాల కోసం ‘ఒకే ర్యాంకు ఒకే పింఛను’ సూత్రాన్ని అంగీకరించారు.

చిదంబరానికి ముందు కూడా తాత్కాలిక బడ్జెట్‌లో కీలక మార్పులు చేసిన ఆర్థిక మంత్రులు ఉన్నారు. 2009-10 తాత్కాలిక బడ్జెట్‌లో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ కూడా కొన్ని కీలక ప్రకటనలు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులలో కమర్షియల్‌ బ్యాంకు రుణాలను 60శాతం దాకా రీఫైనాన్స్‌ చేయడానికి ప్రతిపాదనలు చేశారు. ఇది మౌలిక రంగంలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులకు సంబంధించింది. అంతకంటే ముందు 2004-05 తాత్కాలిక బడ్జెట్‌లో నాటి ఆర్థిక మంత్రి జశ్వంత్‌ సింగ్‌ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్‌ జీతంలో 50శాతం డీఏను కలపాలని ప్రతిపాదించారు. అలాగే వ్యవసాయ ఆదాయ ఇన్సూరెన్స్‌ పథకం 20 జిల్లాల నుంచి 100 జిల్లాలకు విస్తరింపజేస్తున్నట్లు ప్రకటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos