అమ్మకానికి “హీరా” ఆస్తులు?.. అధికారుల చోద్యం?.

  • In Crime
  • January 22, 2019
  • 724 Views
అమ్మకానికి “హీరా” ఆస్తులు?.. అధికారుల చోద్యం?.

వందల కోట్ల రూపాయల మేర ప్రజలకు కుచ్చుటోపి పెట్టింది హీరా గ్రూప్. అది చాలదన్నట్లు మరోసారి మోసానికి తెగించిందా? ఆ సంస్థ ఛైర్మన్ నౌహీరా షేక్ జైలులో ఉన్నా.. సంస్థ ఆస్తులు అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇలాంటి ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవిదేశాల నుంచి డిపాజిట్లు సేకరించిన హీరా గ్రూప్ యజమాన్యం పోలీసులకు చిక్కినా.. లోలోన అన్నీ చక్కబెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆస్తులు రికవరీ కాకుండా ఎక్కడికక్కడా అమ్ముకుని సొమ్ము చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది.
కోట్లు కొల్లగొట్టి.. ఇప్పుడేమో ఇలా..!
హీరా గ్రూప్ నిర్వాకం మరోసారి తెరపైకి వచ్చింది. లక్షలాది మంది డిపాజిటర్ల సొమ్మును కొల్లగొట్టిన యాజమాన్యం వందల కోట్ల రూపాయలు మూటగట్టుకుంది. అది చాలదన్నట్లు ఇప్పుడు మరో మోసానికి తెరదీస్తోందనే వార్త చర్చానీయాంశంగా మారింది. హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌ లోని సొంత కమర్షియల్ కాంప్లెక్స్ లో దాదాపు 15 ఏళ్ల నుంచి కార్యాలయం నిర్వహిస్తోంది. ఇదే హెడ్ ఆఫీస్ గా దేశవిదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించిన హీరా గ్రూప్.. అనతికాలంలోనే వందల కోట్ల రూపాయలను డిపాజిట్లుగా సేకరించింది. అధిక వడ్డీ ఆశజూపి పలువుర్నీ నట్టేట ముంచింది. ఈ గ్రూప్ ఛైర్మన్ నౌహీరా షేక్ పై తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక తదితర రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.
జైలు నుంచే అంతా..?
కొందరు బాధితుల ఫిర్యాదుతో ఇటీవల నౌహీరా షేక్ ను అరెస్ట్ చేసి.. చిత్తూరు జిల్లా జైలులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంచారు. అయితే బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తుండటంతో హీరా గ్రూప్ పై కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో మొదటినుంచి మోసాలు చేయడమే ఆమెకు అలవాటుగా మారిందనే ఆరోపణలున్న నౌహీరా షేక్.. మరోసారి తన క్రిమినల్ మైండ్ కు పదునుపెట్టినట్లు తెలుస్తోంది. ఆస్తులను ఒక్కొక్కటిగా అమ్మి సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారట. అదంతా కూడా బయటకు పొక్కకుండా సీక్రెట్ గా జరగాలని సన్నిహితులకు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మాసాబ్‌ట్యాంక్‌ లోని కమర్షియల్ కాంప్లెక్స్ ను బేరానికి పెట్టారనే వాదనలు షికారు చేస్తున్నాయి.
పాత తేదీలతో అగ్రిమెంట్లు..?
హీరా గ్రూప్ సంస్థకు చెందిన ఆస్తులు అమ్మేందుకు కొందరు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఎక్కడా కూడా తమ పేరు బయటకు రాకుండా చూసుకోవడంతో పాటు ఈ వ్యవహారంలో చాకచక్యంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. కేసులు నమోదు కాకముందు పాత తేదీతో ఆ కమర్షియల్ కాంప్లెక్స్ ఇతరులకు అమ్మివేసినట్లుగా అగ్రిమెంట్లు చేశారట. ఇదంతా కూడా నౌహీరా షేక్ కనుసన్నల్లో నడుస్తోందట. కేసులు నమోదయి ఉచ్చు బిగిసినప్పుడు ఆస్తులు రికవరీ కాకుండా అతి జాగ్రత్తగా చేసిన ప్లాన్ గా కనిపిస్తోంది. ఇలా ఒక్కొక్కటిగా సంస్థ ఆస్తులు అమ్మి వచ్చిన డబ్బును బినామీ పేర్లపై డిపాజిట్లుగా పెట్టుకోవాలనేది ఆమె స్కెచ్చేమో. అయితే కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోకుండా హీరా గ్రూప్ ఆస్తులను సీజ్ చేస్తే నిందితులకు అలాంటి అవకాశం ఉండదుగా అనే వాదన బలంగా వినిపిస్తోంది. అయితే హీరా గ్రూప్ తమను మోసం చేసినా… సంస్థ ఆస్తులున్నాయి కదా అని అంతో ఇంతో ఆశలు పెట్టుకున్న డిపాజిటర్లు మాత్రం అయోమయానికి గురవుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos