అగ్రవర్ణాలను బుజ్జగించే ప్రయత్నమే.

అగ్రవర్ణాలను బుజ్జగించే ప్రయత్నమే.న్యూదిల్లీ: ఆర్థికంగా వెనుకబడ్డ అగ్ర వర్ణాలకు (ఈడబ్ల్యూఎస్‌) కూడా పది శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై దళిత సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకతలు వస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన మేధావులు, నిరసనకారులు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమే అవుతుందని విమర్శిస్తున్నారు. ‘‘రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లను కులాల ప్రాతిపదికన ఇవ్వాలి. ఆర్థిక స్తోమత ప్రాతిపదికన కాదు. పేదరికాన్ని నిర్మూలించేందుకు రిజర్వేషన్లు వాడేందుకు వీలు లేదు. ప్రభుత్వ నిర్ణయం.. అసహ్యకరమైంది. అంతేకాక ఇది ఒక రాజకీయ ఎత్తుగడ.’’ అని జవహార్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ సీనియర్‌ ఆచార్యుడు వివేక్‌ కుమార్ అన్నారు.

ఆర్థికంగా వెనుకబడ్డ అగ్ర కులాల వారికి రిజర్వేషన్ల నిర్ణయాన్ని జాతీయ దళిత సంస్థ సమ్మేళనం ఛైర్మన్‌ అశోక్ భర్తీ ఖండించారు. ‘‘ప్రభుత్వంలో ఏ స్థాయిలోనూ అగ్ర కులాల వారిని చిన్న చూపు చూడట్లేదు. జనాభాలో ఎక్కువగా ఉన్న వర్గం వారికి రిజర్వేషన్లు కల్పించడం.. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా లేదు. తాజా ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగాన్ని స్పష్టంగా ధిక్కరించడమే అవుతుంది. అంతేకాకుండా ఈ చర్య అగ్ర కులాల వారిని బుజ్జగించడం లాంటిది.’’ అని ఆయన అన్నారు.

అగ్ర కులాల్లో పేదవారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సోమవారం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాజిక న్యాయాన్ని నీరుగార్చడమేనని గుజరాత్‌కు చెందిన దళిత హక్కుల నిరసనకారిణి మంజులా ప్రదీప్‌ అభిప్రాయపడ్డారు. దీని ఫలితంగా నిమ్నవర్గాల నుంచి ప్రభుత్వం మరింత ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని అన్నారు. ‘‘ముస్లిం, క్రైస్తవ మతాల్లో కొన్ని వర్గాల వారు తమను ఎస్సీ జాబితాలో చేర్చాలని చాలా కాలం నుంచి కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వం అగ్ర వర్ణాలవారినే మెప్పించే ప్రయత్నం చేస్తోంది. అందుకే ఈ నిర్ణయం ప్రకటించింది’’ అని నేషనల్‌ దళిత్‌ మూవ్‌మెంట్‌ ఫర్‌ జస్టిస్‌ కార్యదర్శి రమేశ్‌ నాథన్‌ అన్నారు.

అధికారం చేపట్టిన నాటి నుంచి భాజపా కొన్ని అంశాల్లో దళితుల ఆగ్రహాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. 2016లో రోహిత్‌ వేముల ఆత్మహత్య, గుజరాత్‌లోని ఊనాలో దళిత యువకులను కొరడాలతో కొట్టిన ఘటన, గతేడాది జరిగిన భీమా కొరేగావ్‌ ఘటన.. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం వ్యవహారంలో తొలుత ప్రభుత్వం వ్యవహరించిన తీరు వంటి పరిణామాలపై దళితులు భాజపాకు వ్యతిరేకంగా మారిన సంగతి తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos