వైఎస్సార్సీపీలో బస్సుయాత్ర కలకలం!

ప్రస్తుతం సొంత జిల్లా, సొంత నియోజకవర్గం పర్యటనలో ఉన్నాడు జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా జగన్ సొంత జిల్లా నేతలను, సొంత నియోజకవర్గం ప్రజలను, సొంత కుటుంబీకులనూ కలుస్తూ ఉన్నాడు. అలాగే సొంత నియోజకవర్గంలో అభ్యర్థుల ప్రకటన విషయంలో కూడా జగన్ కసరత్తును పూర్తి చేస్తున్నాడు. అభ్యర్థులను ప్రకటిస్తున్నాడు. 

కడప జిల్లాలో జగన్ అభ్యర్థుల విషయంలో మరీ వడపోసేందుకు పెద్దగా ఏమీ లేదు. ఫిరాయింపు నియోజకవర్గాల్లో మాత్రమే అభ్యర్థుల ప్రకటన పెండింగ్ ఉన్నట్టు. జమ్మలమడుగులో అది పూర్తి అయ్యింది. ఇక కడప ఎంపీ సీటు విషయంలో కొంత ప్రతిష్టంభన ఉందని అంటున్నారు. అవినాష్ రెడ్డిని మళ్లీ పోటీ చేయించడమా? లేక వైఎస్ వివేకానందరెడ్డిని బరిలోకి దించడమా? అనే ఆలోచన జగన్ కు ఉందనే మాట వినిపిస్తోంది. ఈ విషయంలో గట్టిగానే సమాలోచనలు సాగుతున్నాయని సమాచారం. అయితే ఇది మరీ తలబద్ధలు కొట్టుకోవాల్సిన అంశం ఏమీ కాదు కానీ.. వైసీపీలో అంతకు మించిన విషయం ఒకటి చక్కర్లు కొడుతోంది.

అదే బస్సు యాత్ర.. వైసీపీలో ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారుతోంది. ఇటీవలే పాదయాత్రను ముగించుకున్న జగన్ మోహన్ రెడ్డి.. ఫిబ్రవరి మొదటి వారం నుంచి బస్సు యాత్రకు సమాయత్తం అవుతున్నారనే మాట వైసీపీలో కలకలాన్ని రేపుతోంది.అదెందుకో చెప్పనక్కర్లేదు. ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. అప్పటికీ జగన్ ఇంకా యాత్రలు చేస్తూనే ఉంటే ఎలా? అనేది ప్రశ్న. పాదయాత్ర తో మిస్ అయిన నియోజకవర్గాలను బస్సు యాత్రతో కవర్ చేస్తానని ఇది వరకే జగన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో బస్సు యాత్రకు జగన్ సిద్ధం అవుతున్నారు.

అయితే అలాంటి నియోజకవర్గాల సంఖ్య అటు ఇటుగా యాభై వరకూ ఉంటుంది! సగటున ఒక్కో నియోజకవర్గంలో ఒక్క రోజు అనుకుంటే.. అంతే సంగతులు! ఇలా కాకుండా.. రోజుకు రెండూ, మూడు నియోజకవర్గాలు అనుకుంటే మాత్రం ఆ యాత్ర పదిహేను రోజుల్లో ముగిసే అవకాశం ఉంది. అయినప్పటికీ ఎన్నికల ముందు అది చాలా ఎక్కువ సమయమే!

ఎన్నికల్లో ఎదుర్కొనాల్సింది చంద్రబాబును. అది కూడా.. అధికారాన్ని చేతిలో పెట్టుకున్న చంద్రబాబును! అభ్యర్థుల ప్రకటన అంశం ఇంకా పూర్తిగా తేలనే లేదు కూడా. ఇలాంటి నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి మళ్లీ యాత్రకు రెడీ అయిపోతుండటం వైసీపీలో కొత్త చర్చకు తెరలేస్తోంది. బస్సు యాత్రను మినహాయించి.. జగన్ అన్ని నియోజకవర్గాల వారికీ అందుబాటులో ఉండటం మేలనే మాట ఆ పార్టీ నుంచి వినిపిస్తోంది. అలా ఏం కాదు.. బస్సు యాత్రతో ప్రచార పర్వం మొదలైనట్టే.. వివిధ నియోజకవర్గాలకు వెళ్లి అక్కడ జనం మధ్యన జగన్ అభ్యర్థులను ప్రకటిస్తే వచ్చే ఊపు వేరనే అభిప్రాయమూ వినిపిస్తోంది!

తాజా సమాచారం

Latest Posts

Featured Videos