అఖిలేశ్‌, మాయావతి పొత్తుపై రేపు ప్రకటన!

అఖిలేశ్‌, మాయావతి పొత్తుపై రేపు ప్రకటన!

లఖ్‌నవూ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో తిరిగి పట్టు సాధించేందుకు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఏళ్ల నాటి వైరాన్ని పక్కనబెట్టి బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ)తో చేతులు కలిపేందుకు సిద్ధమైంది. ఈ మహాకూటమిపై రేపు అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతి కలిసి శనివారం మీడియా సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలోనే లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల్లో కూటమిపై గత కొన్ని రోజులుగా అఖిలేశ్‌, మాయావతి విస్తృత స్థాయిలో సమావేశాలు జరిపారు. గతవారం దిల్లీలో భేటీ అయిన వీరిద్దరూ దాదాపు సీట్ల పంపకాలను ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎస్పీ, బీఎస్పీతో పాటు రాష్ట్రీయ లోక్‌దళ్‌, నిషద్‌ పార్టీ లాంటి చిన్న పార్టీలను కూడా కలుపుకుని మహాకూటమిగా బరిలోకి దిగాలని అఖిలేశ్‌, మాయావతి నిర్ణయానికి వచ్చారు.

అయితే ఈ మహాకూటమిలో కాంగ్రెస్‌కు మాత్రం చోటు దక్కే అవకాశాలు కన్పించట్లేదు. కాంగ్రెస్‌ వైఖరిపై అఖిలేశ్‌, మాయావతి అసంతృప్తిగా ఉన్నారని, ఆ పార్టీని కూటమిలో చేర్చుకునేందుకు సుముఖంగా లేరని ఇటీవల వార్తలు వచ్చాయి. వీటిపై హస్తం పార్టీ కూడా స్పందించింది. యూపీలో ఒంటరిపోరుకు తాము సిద్ధమవుతున్నట్లు సూచనప్రాయంగా తెలిపింది. అయితే యూపీలో కాంగ్రెసేతర మహాకూటమి ఇతర రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపిస్తుందని కాంగ్రెస్‌ ఆందోళన పడుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. యూపీలో కాంగ్రెస్‌కు మంచి పట్టున్న అమేథీ, రాయ్‌బరేలీలో మాత్రం మహాకూటమి బరిలోకి దిగే అవకాశాలు తక్కువగా కన్పిస్తున్నాయి.

యూపీలో మొత్తం 80 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా ప్రభంజనం సృష్టించింది. 73 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. అప్పట్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎస్పీ కేవలం 5 స్థానాలకే పరిమితమవడం గమనార్హం. ఆ తర్వాత 2017లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎస్పీకి ఘోర పరాజయం తప్పలేదు. దీంతో ఈ సారి మహాకూటమితో భాజపాపై పోరుకు సిద్ధమయ్యారు మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌.

గతేడాది యూపీలో జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ చేతులు కలిపి భాజపాను ఓడించాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇదే సిద్ధాంతాన్ని అమలు చేయాలని వ్యూహాలు రచిస్తున్నాయి. ఏదేమైనా యూపీలో భాజపాకు గట్టి సవాల్‌ ఎదురవబోతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos