241 కిలోల బరువు తగ్గిన మహిళ

241 కిలోల బరువు తగ్గిన మహిళ

ముంబై : ఆసియాలోనే ఆమె అత్యంత బరువైన మహిళ. బరువెంతో తెలుసా..300 కేజీలు. ప్రస్తుతం ఆమె బరువు 86 కిలోలు. ఇదెలా సాధ్యమైంది. చదవండి, మీకే తెలుస్తుంది. ముంబైలోని వసాయ్‌ ప్రాంతానికి చెందిన రజనీ అధిక బరువుతో సతమతమయ్యేది. ప్రతి పనికీ కుటుంబ సభ్యులపై ఆధారపడాల్సి వచ్చేది. అడుగు తీసి అడుగు వేయలేకపోయేది. ఎప్పుడూ ఇంటికే పరిమితం. క్రమంగా మానసిక అస్వస్థతకు లోనైంది. ఆమెను చూసి మేనల్లుడు ఏడవడం మొదలుపెట్టేవాడు. దీంతో ఆమె మరింతగా కుంగిపోయింది. అధిక బరువు కారణంగా ఆమెకు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తేవి. మూత్ర పిండాల సమస్యలు, మధుమేహంతో బాధపడేది. ఊపిరి తీసుకోవడమూ కష్టమయ్యేది. ఈ దశలో డాక్టర్‌ శశాంక్‌ షా గురించి ఆమె తల్లిదండ్రులకు ఎవరో చెప్పారు. ఆయనను కలసి సమస్యను చెప్పుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం డాక్టర్‌ ఆమెకు బరువు తగ్గే (బేరియాట్రిక్‌) సర్జరీ నిర్వహించారు. అనంతరం మరో సర్జరీ చేశారు. ఇవన్నీ పూర్తయ్యాక కేలరీ తక్కువగా ఉన్న ఆహారాన్ని రజనీకి అందించేవారు. కొన్ని ఆహార పదార్థాలను తక్కువ మోతాదులో తీసుకోమని చెప్పేవారు. బేరియాట్రిక్‌ సర్జరీ అనంతరం ఇన్ఫెక్షన్లు, రక్తం గడ్డ కట్టడం, మూత్ర పిండాల వైఫల్యం లాంటి సమస్యలు కూడా ఎదురు కావచ్చని డాక్టర్ షా మొదట్లో ఆమెకు చెప్పినప్పుడు భయపడి వెనకడుగు వేసింది. కానీ ఆయన ధైర్యం చెప్పడంతో అంగీకరించింది. సర్జరీ అనంతరం డాక్టర్‌ దగ్గరుండి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పర్యవేక్షించేవారు. ఆమెతో వ్యాయామం కూడా చేయించారు. ఇప్పుడు రజనీ విహార యాత్రలతో దేశమంతా చుడుతోంది.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos