ఎందుకీ ఆజ్యం…? వివాదాస్పదమవుతున్న పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్‌సీ

ఎందుకీ ఆజ్యం…? వివాదాస్పదమవుతున్న పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్‌సీ

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం  పౌరసత్వ చట్టం 1955కు సవరణలు (సీఏఏ) తీసుకొచ్చింది. ఇటీవల అసోంలో అమలు చేసిన జాతీయ పౌరుల జాబితా (ఎన్‌ఆర్‌సీ)ను దేశ వ్యాప్తంగా విస్తరించనుంది. వీటికి వ్యతిరేకంగా దేశమంతటా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. అసోం, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌, మేఘాలయ, బీహార్‌ రాష్ట్రాలలో ప్రజలు తిరగబడుతున్నారు. ఇప్పుడది ఢిల్లీకీ పాకింది. కర్ఫ్యూలు విధించినా, ఇంటర్‌నెట్‌ సౌకర్యాలను నిలిపివేసినా, పోలీసులు కాల్పులు జరుపుతున్నా… లెక్క చేయకుండా లక్షల సంఖ్యలో ప్రజలు వీధులలోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. బెంగాల్‌లో ఏడు రైళ్ళను తగుల బెట్టారు. ఢిల్లీలో మూడు  బస్సులను దహనం చేశారు. దేశంలోని అనేక ప్రాంతాలలో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.

ఎందుకు ప్రజలలో దీని పట్ల ఇంతగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి? ఇంతకూ  వీటిలో ఏముంది?

పౌరసత్వ చట్ట సవరణ అంటే ఏమిటి?

భారత పౌరసత్వ చట్టం 1955లో వచ్చింది. ఈ చట్టం ప్రకారం భారత దేశంలో ఉన్న పౌరులందరూ భారతీయ పౌరులే అవుతారు. దేశ విభజన సమయంలో పాకిస్తాన్‌, తూర్పు పాకిస్తాన్‌ ( నేటి బంగ్లా దేశ్‌), మయన్మార్‌ నుంచి మన దేశంలోకి వలస వచ్చిన వారికి ఏ ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వాలో ఈ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇందులో కుల, మత, లింగ భేదాలు లేవు. ఇదే నేటివరకు అమలు జరుగుతున్నది.

ఇప్పుడు భాజపా ప్రభుత్వం ఈ చట్టానికి సవరణ చేసింది. ఈ సవరణ ప్రకారం పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, దేశాలలో మత వివక్షకు గురై భారత్‌లోకి వచ్చిన హిందువులకు,  క్రైస్తవులకు, సిక్కులకు, జైనులకు, బౌధ్ధులకు మాత్రమే భారత పౌరసత్వం లభిస్తుంది. ఇందులో ముస్లింలకు స్థానం లేకుండా చేశారు. పోనీ అలాగని హిందువులుండే దేశాలన్నింటినీ కలిపారా అంటే, అదీ లేదు. ఉదాహరణకు శ్రీలంకలో తమిళులు తాము సింహళ జాతీయుల చేతులలో వివక్షకు గురవుతున్నామని పోరాడుతున్నారు. వేలుపిళ్లై  ప్రభాకరన్‌ నాయత్వంలో గతంలో సాయుధ పోరాటం సైతం నడిపారు. ఆనాటి నుంచి నేటికీ  తమిళులు శ్రీలంక నుంచి పారిపోయి భారత్‌కు వస్తున్నారు. వారిలో అత్యధికులు హిందువులే. ఈ సవరణలలో శ్రీలంకను కలపలేదు. భూటాన్‌లో క్రైస్తవులు వివక్షకు గురవుతున్నారు. అయినా సరే భూటాన్‌ను కలుపలేదు. ఇవన్నీ చూసినప్పుడు కేవలం ముస్లింలే లక్ష్యంగా చట్ట సవరణలు చేసినట్లు తేటతెల్లమవుతోంది.

అసలు మతం ఆధారంగా పౌరసత్వాన్ని గుర్తించడమేమిటీ? ఇదే కీలకమైన ప్రశ్న. మతం ఆధారంగా పౌరసత్వాన్ని గుర్తించడం ప్రపంచంలో ఎక్కడా లేదు. చివరకు మత రాజ్యాలుగా ఉన్న గల్ప్‌ దేశాలకు ఇతర దేశాల నుంచి ముస్లింలు వెళ్ళినా, వాటికన్‌ సిటీకి ఇతర దేశాల నుంచి క్యాథలిక్‌ క్రైస్తవులు వెళ్ళినా పౌరసత్వం ఇవ్వరు. అలాగే ప్రపంచంలో ఒకే మతానికి చెందిన వారైనప్పటికీ ఇతర దేశాల నుంచి వచ్చేవారికి పౌరసత్వం ఇవ్వరు. ప్రతి దేశంలో పౌరసత్వ చట్టాలు ఏమతం వాడైనప్పటికీ ఒకే రకంగా ఉంటాయి. మతం విశ్వాసానికి సంబంధించినది. పౌరసత్వం దేశ రాజ్యాంగానికి సంబంధించినది. వ్యక్తి విశ్వాసాన్ని మార్చుకోవచ్చు. కాని రాజ్యాంగం దేశ పౌరులందరికీ ఒకటే. దానిలో ఏ మార్పువచ్చినా అది ఆ దేశ ప్రజలందరికీ వర్తించేటట్లు మార్పు చేయాల్సిందే.

ఇతర దేశాల నుంచి కాందిశీకులుగా వచ్చిన వారికి మన దేశంలో పౌరసత్వమివ్వాలా, వద్దా అన్నది ప్రభుత్వ నిర్ణయం. ఇవ్వదలుచుకుంటే కాందిశీకులుగా వచ్చినవారందరికీ ఇవ్వాలి. ఇవ్వదలుచుకోకపోతే పౌరసత్వం లేకుండా అలా బ్రతకనివ్వవచ్చు లేదా వారి మాతృ దేశాలకు తిప్పి పంపివేయవచ్చు. అంతేగాని మతపరంగా పౌరసత్వం ఇవ్వడమేమిటి? ఇది రాజ్యాంగ విరుధ్ధం. అందుకే దేశంలోని వివిధ పార్టీలు, రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలలో వీధి పోరాటాలు జరుగుతున్నాయి. అసోం ప్రజలు కాందిశీకులుగా తమ రాష్ట్రంలోకి వచ్చిన హిందూ, ముస్లిం, క్రైస్తవు, సిక్కు, జైన, బౌధ్ధులను అందరినీ మత ప్రసక్తి లేకుండా వెనుక్కు పంపేయాలని పోరాడుతున్నారు. వారిపై పోలీసులు కాల్పులు జరుపుతున్నారు.

ఇంత వివక్షతో కూడినది కనుకనే ఐక్కరాజ్య సమితి దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ సవరణకు వ్యతిరేకంగా భారత్‌లో జరగుతున్న ఆందోళనలను గమనించిన అమెరికా, కెనడా, సింగపూర్‌, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ దేశాలు తమ దేశాల పర్యాటకులు భారత్‌కు వెళ్లవద్దని సూచించాయి. ఆ మేరకు ఆయా దేశాల పర్యాటక సంస్థలకు ఆదేశాలు వెళ్లాయి.  ఆ దేశాలన్నీ మన దేశాన్ని ఒక భయానక దేశంగా చూస్తున్నాయి.

 

జాతీయ పౌరసత్వ జాబితా (National Register of Citizens of India)

 

ఈ పౌరసత్వ చట్ట సవరణ వల్ల మన రాష్ట్రంలో మనకేమిటి నష్టం? అసోంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ పౌరసత్వ జాబితా (NRC)ను ఎన్నికలకు ముందే అమలు జరిపింది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా దీనిని అమలు చేయనుంది. దీని ప్రకారం 24 మార్చి 1971కు ముందు నుంచే ఈ దేశంలో ఉంటున్నామని పౌరులు నిరూపించుకోవాలి. అంటే 48 ఏళ్ళ కిందటి ఆధారాలు సమర్పించాలి. అప్పుడే మన పేరును ఆ జాబితాలో నమోదు చేస్తారు. లేకపోతే మనల్ని ఈ దేశ పౌరులుగా గుర్తించరు. ఈ దేశ పౌరులుగా గుర్తింపు పొందడానికి ఆధార్‌, పాన్‌ కార్డులు, డ్రైవింగ్‌ లైసెన్సులు లాంటివి సరిపోవు. ఇవన్నీ మనకు లాగానే అసోం ప్రజల వద్దా ఉన్నాయి. అయినా అసోంలో 19 లక్షల మందికి ఈ జాబితాలో చోటు దక్కలేదు. వారిలో అత్యధికులు ఈ దేశంలో పుట్టి, పెరిగినవారే. వీరిలో సగం మంది హిందువులు కూడా ఉన్నారు. కారణం 48 ఏళ్ళ కిందటి ఆధారాలు వారి వద్ద లేవు. రేపు మనకు కూడా అటువంటి పరిస్థితే ఎదురు కావచ్చు. అత్యధికులు ఆధారాలు చూపలేరు. కారణం 1971కు ముందు బర్త్‌ సర్టిఫికెట్లు లేవు. ఆనాడు ఉన్న ఓటరు జాబితాలో తన పేరుగాని తన తల్లిదండ్రుల పేరుగాని ఉంటే ఉన్నట్టు లేకపోతే లేదు. అసలా ఓటరు జాబితా దొరకడమే కష్టం. ఆనాడు ఆస్తిపాస్తులను కలిగి ఉన్నట్లుగా పన్ను రసీదులు లాంటివి ఏమైనా చూపాలి. అందరి దగ్గరా అవి ఉండకపోవచ్చు. ఆస్తులు లేని వారైతే అసలు చూపించే అవకాశమేలేదు. లేదా 1971 ముందు ఇచ్చిన రేషన్‌ కార్డు ఉంటే అది చూపవచ్చు. అవి ఎంత మంది వద్ద ఉన్నాయి? 1971కు ముందుగానీ తర్వాతగానీ చాలా మంది పనుల కోసం, ఉద్యోగాల కోసం పట్టణాలకు వలస వచ్చారు. వారి దగ్గర ఆనాటి ఆధారాలు ఉండే అవకాశాలు చాలా తక్కువ. సీజనల్‌గా వలసపోయే వ్యవసాయ కూలీలకు, అటవీ ప్రాంతాలలో నివసించే ట్రైబల్స్‌, పనులు, ఉద్యోగాలు వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లిన కార్మికులు, ఉద్యోగులు ఘోరంగా దెబ్బతింటారు. ఈ ఆధారాలకోసం మనం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగవలసి వస్తుంది. ఈ లంచగొండి సమాజంలో డిమాండును బట్టి లంచాలుంటాయి. ఆ జాబితాలో మనం పేరు నమోదు చేసుకునేవరకు మన పాస్‌పోర్టులు, రేషన్‌ కార్డులు, ఓటు హక్కు ఉండవు. కొన్ని సందర్భాలలో ఉద్యోగాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. ఈ పాలకులు తమకు కావాలనుకున్న వారి పేర్లను మాత్రం జాబితాలో నమోదు చేయిస్తారు. భారత 5వ రాష్ట్రపతి ఫ్రక్రుద్దీన్‌ ఆలీ అహమ్మద్‌ అసోంకు చెందిన వారు. ఆయన కుటుంబ సభ్యులకు ఈ జాబితాలో చోటు దక్కలేదు. వీరు భారతీయ పౌరులు కాదట. 30 సంవత్సరాల పాటు భారత ఆర్మీలో లెఫ్టినెంట్‌ అధికారిగా పని చేసి, కార్గిల్‌ లాంటి యుధ్ధాలలో పాల్గొని, రిటైరైన వ్యక్తిని, ‘నీవద్ద సరైన ఆధారాలు లేవు, నీవు భారతీయ పౌరుడవు కావు’ పొమ్మన్నారట. అనేక మంది రిటైరైన బ్యాంకు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల పేర్లను జాబితాలో నమోదు చేయకుండా, మీరు భారత పౌరులు కాదన్నారు. కారణం 48 ఏళ్ళ కిందటి ఆధారాలు చూపలేక పోవటమే. అంతటి ఉన్నత స్థానాలలో దేశానికి సేవ చేసినవారే ఆధారాలు చూపలేక పోతే సామాన్యులు చూపగలరా? వీటినిబట్టి చూస్తే ఈ జాబితా ప్రభావం మన మీద ఎలాంటి దుష్పరిణామాలు చూపబోతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. పేద ముస్లింలందరూ ఇలాంటి ఆధారాలు చూపలేక ఈ దేశ పౌరసత్వాన్ని కోల్పోతారని మత పెద్దలు ఆందోళన చెందుతున్నారు. బెంగళూరు లాంటి నగరాల్లో అలాంటి పేదలకు చేయూతనివ్వడానికి మత పెద్దలు నడుం బిగించారు.

ఈ దేశంలో పుట్టి పెరిగిన మనం, తరతరాలుగా ఈ గడ్డ మీదనే జీవిస్తున్న మనం, 72 ఏళ్ళ స్వాతంత్య్రం తరువాత మనం ఈ దేశ పౌరులమేనని నిరూపించుకోవాల్సిన దుస్థితి ఏమిటి? ఆధారాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగడమేమిటి? జాబితాలో పేరు లేదని ఏడుస్తూ కూర్చోవడమేమిటి? అసోంలో జరుగుతున్నది ఇదే. రేపు మనకు జరుగవచ్చనేమో!  ప్రజాస్వామ్యాన్ని పక్కనబెట్టి, ఈ దేశ ప్రజలను తమ చెప్పు కింద తేళ్లులా అదిమి ఉంచటానికి ఆర్‌.ఎస్‌.ఎస్‌., భాజపా వేసిన ఎత్తుగడ ఇది. భాజపా దేశ ప్రజల జీవితాలతో ఆడుతున్న వికృత రాజకీయ క్రీడ.

 

ఈ జాబితా వల్ల అసోంలో జరుగుతున్న ఆందోళలను చూస్తున్నాం. ఇది దేశం మొత్తం అమలు జరిపితే, దేశం మొత్తం ఆందోళనలతో పోరాటాలతో అట్టుడికి పోతుంది. ఈ ఆందోళనలో మనం, మన బిడ్డలు నలిగి పోవటం అవసరమా?

ఇది గమనించే కేరళ, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌, ఛత్తీస్‌ఘడ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్‌ఆర్‌సీని తమ రాష్ట్రాలలో అమలు జరిపేది లేదని విస్పష్టంగా  ప్రకటించారు. రాష్ట్రాలకు ఆపే హక్కు లేదని కేంద్రం అంటోంది. మన రాష్ట్రంలో అధికారంలో ఉన్న వై.ఎస్‌.ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పార్లమెంటు ఉభయ సభల్లో ఈ చట్ట సవరణకు అనుకూలంగా ఓటేశాయి. ఒకాయనకు తమ మీద కేసుల భయం. ఇంకొకాయనకు మళ్లీ భాజపాతో సయోధ్య కుదుర్చుకోవాలనే ఆరాటం. వీరికి వీరి ప్రయోజనాలే ముఖ్యం తప్ప, రాష్ట్ర, దేశ ప్రజల ప్రయోజనాలు ముఖ్యం కాదు. దేశ సమైక్యత ముఖ్యం కాదు.

కొంతమంది ఇదేదో ముస్లింల గోల అని, మరికొంతమంది ఇంకా కాస్త ముందుకు వెళ్ళి ముస్లింలను బుజ్జగించటానికి రాజకీయపార్టీలు చేస్తున్న గోల అని, మరి కొంతమంది ఇది మన రాష్ట్రంలో లేదుగా మనకెందుకులే అని ప్రచారం చేస్తున్నారు. ఇది సమస్యను పక్క దారి పట్టించి, భాజపా  చేస్తున్న దుర్మార్గాలకు ప్రతిఘటన లేకుండా చేయటం కోసం చేస్తున్న పన్నాగం. నిజానికి ఇది ముస్లింల గొడవ మాత్రమే కాదు. దేశ ప్రజలందరి గొడవ. ఎన్‌ఆర్‌సీ అమలు జరిగితే దేశ ప్రజలందరికీ ప్రమాదం. ముఖ్యంగా ఉద్యోగులకు, కార్మికులకు తీవ్ర ప్రమాదం. దేశ సమైక్యతకే ప్రమాదం. అందుకే వామపక్షాలు ఈ చట్ట సవరణ, జాతీయ పౌర సత్వ జాబితాలకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించాయి. దుర్మార్గమైన ఈ రెండింటినీ  వెనక్కు తీసుకునేవరకు పోరాడడం ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి భారతీయుడి కర్తవ్యం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos