మీ చేతిలోనే శౌచాలయాల జాబితా

మీ చేతిలోనే శౌచాలయాల జాబితా

ఢిల్లీ : జాతి పిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా 2,300 నగరాల్లో 57 వేల శౌచాలయాల సమాచారాన్ని గూగుల్ మ్యాప్స్‌లో పొందుపరచడానికి ఆ సంస్థ జాబితాను తయారు చేసింది. ప్రతి నెల దాదాపు 2.5 లక్షల మంది శౌచాలయాల కోసం గూగుల్‌లో వెతుకుతుండటంతో ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటికే ఈ సంస్థ స్వచ్ఛభారత్ మిషన్, పట్టణ మంత్రిత్వ శాఖ సహకారంతో 2016లో దేశరాజధాని ఢిల్లీ, భోపాల్, ఇండోర్ నగరాల్లో శౌచాలయాల సమాచారాన్ని గూగుల్‌లో ఇస్తోంది. దీనిపై గూగుల్ మ్యాప్స్ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ అనల్ ఘోష్ మాట్లాడుతూ, శౌచాలయాల సమాచారాన్ని అందించడం అనేది సమాజ పరిశుభ్రత కోసం ఉపయోగపడే ఒక కీలక అంశంగా భావిస్తున్నామన్నారు. ఇది ప్రభుత్వం తలపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఎంతో సహకరిస్తుందన్నారు. ఇప్పుడు వినియోగదారులు గూగుల్ సెర్చ్‌లోకి వెళ్లి ‘పబ్లిక్ టాయ్లెట్స్ నియర్ మి’ అని టైపు చేస్తే చాలు, వారికి సమాచారం అందేలా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. జాబితా సేకరించి మ్యాప్స్‌లో అమలు చేసేందుకు ఇప్పటికే తమ ఇంజనీరింగ్, నిర్వహణ బృందాలు కృషి చేస్తున్నాయని చెప్పారు.

తాజా సమాచారం