కొనసాగుతున్న బీజేపీ, తృణమూల్ వార్

కొనసాగుతున్న బీజేపీ, తృణమూల్ వార్

కోల్‌కతా: పశ్చిమ్‌ బంగాలో భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా ర్యాలీకి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం నుంచి మరోసారి అడ్డంకులు ఎదురయ్యాయి. ఆ రాష్ట్రంలోని మాల్దాలో మంగళవారం భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా పర్యటించాల్సి ఉండగా ఆయన హెలికాప్టర్‌ అక్కడి విమానాశ్రయంలో దిగేందుకు మొదట అనుమతి నిరాకరించిన ఆ జిల్లా అధికారులు ఆ తర్వాత అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం ఆయన ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. అయితే, బుధవారం అమిత్‌ షా.. ఝాఢ్‌గ్రామ్‌ జిల్లాలో పర్యటించాల్సి ఉండగా మరోసారి అదే సీన్‌ రిపీట్‌ అయింది. ఆయన హెలికాప్టర్‌ దిగేందుకు అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆయన మంగళవారం రాత్రి దిల్లీకి వెళ్లినట్లు సమాచారం. మరోవైపు, బుధవారం ఆయన హెలికాప్టర్‌ దిగేందుకు అధికారులు ఆలస్యంగా అనుమతిని ఇచ్చారు. టీఎంసీ తీరుపై భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఝాఢ్‌గ్రామ్‌లో అమిత్‌ షా ర్యాలీ నిర్వహించాల్సి ఉండగా మమతా బెనర్జీ మరోసారి అడ్డంకులు సృష్టించారు’ అని భాజపా కార్యదర్శి కైలాశ్‌ విజయ్‌వార్గియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన హెలికాప్టర్‌ ల్యాండ్‌ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలని తమ పార్టీ కోరిందని, కానీ ఇందుకు అధికారులు నిరాకరించారని ఆ జిల్లా భాజపా నేత తుషర్‌ కె.ఘోష్‌ తెలిపారు. మంగళవారం రాత్రి వరకు ఎదురుచూసినా తమకు నిరాశే ఎదురైందని అన్నారు. ర్యాలీ కోసం మాత్రమే అనుమతి లభించిందని తెలిపారు. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్‌ ప్రకారం అమిత్‌ షా హెలికాప్టర్‌ బుధవారం ఉదయమే ఝాఢ్‌గ్రామ్‌లో దిగాల్సి ఉంది. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరాని కూడా పాల్గొనే అవకాశం ఉందని భాజపా నేతలు తెలిపారు. కాగా, మంగళవారం మాల్దాలో అమిత్‌ షా ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆయన హెలికాప్టర్‌ అక్కడి విమానాశ్రయంలో దిగేందుకు నిన్న కూడా ఆ జిల్లా అధికారులు అనుమతి నిరాకరించారు. విమానాశ్రయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయని, హెలికాప్టర్‌ దిగేందుకు వీలు కాదని చెప్పుకొచ్చారు. మళ్లీ తమ నిర్ణయంపై సోమవారం ఉదయం సంబంధిత అధికారులు వెనక్కి తగ్గి మాల్దాలోని హోటల్‌ గోల్డెన్‌ పార్క్‌ వద్ద ఉన్న మైదానంలో ఆయన హెలికాప్టర్‌ దిగొచ్చని తెలిపారు. దీంతో అమిత్‌ షా పర్యటన కొనసాగింది. తమ రాష్ట్రంలో భాజపా ర్యాలీలు, రథయాత్రలు జరగకుండా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడ్డంకులు సృష్టిస్తున్నారని భాజపా నేతలు విమర్శిస్తున్నారు.

తాజా సమాచారం