పరనింద వద్దు మోదీ

పరనింద వద్దు మోదీ

న్యూఢిల్లీ: పరనింద, ఆత్మస్తుతి విధానానికి చరమగీతాన్ని పాడండని రాబర్ట్‌ వాద్రా బుధవారం ప్రధాని మోదీకి రాసిన లేఖలో హితవు పలికారు. ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే రైతులను లూటీ చేసిన ‘షెహన్షా’ను కటకటాల వెనక్కి పంపిస్తానని మోదీ ఫతేబాద్లో ఎన్నికల ప్రచార సభలో పేర్కొన్నందుకు వాద్రా ఆ మేరకు స్పందించారు.అసలు సమస్యలే లేవన్నట్టుగా తన గురించి మాట్లాడటం సరికాదని, ఐదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం వల్ల వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నానని విమర్శించారు. లేఖ పూర్తి పాఠాన్ని ఈ దిగువ ఇచ్చాం. ‘గౌరవనీయులైన ప్రధాని గారికి, మీ ర్యాలీలో మరోసారి నా పేరు వినిపించడం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. దేశాన్ని కలవరపరిచే పేదరికం, నిరుద్యోగం, మహిళా సాధికారత వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవేవీ సమస్యలే కానట్టు మీరు నా పేరునే తలకెత్తుకున్నట్టు కనిపిస్తోంది. మీ ప్రభుత్వం గత ఐదేళ్లుగా నన్ను తీవ్రమైన వేధింపులకు గురిచేసింది. వివిధ ఏజెన్సీలు, కోర్టులు, ఆదాయం పన్ను శాఖలు మానసికంగా నన్ను కృంగదీసి, ఒత్తిడి తెచ్చేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉన్నాయి. విచారణకు రమ్మంటూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈడీ 11 సార్లు సమన్లు పంపింది. ప్రతిసారి 8 నుంచి 11 గంటల పాటు విచారించింది. కానీ ఏ ఒక్క ఆరోపణ కూడా నిరూపితం కాలేదు. నాకు ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం ఒక్కటే. నా పేరు పదేపదే ప్రస్తావించడం ద్వారా మీరు ఏం సాధించ దలచుకున్నారు? మీ ప్రభుత్వ వైఫల్యాలను, సొంత తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు మీరు పదేపదే నా నామజపం చేస్తున్న విషయం దేశప్రజలందరికీ తెలుసు. దయవుంచి నాపై మీ వ్యక్తిగత దాడులు ఆపండి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా గౌరవప్రదమైన న్యాయ వ్యవస్థను మీరు అవమానపరుస్తున్నారు. భారతదేశ న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నిజం నిగ్గు తేలుతుంది. ఈ దేశ ప్రజలను భగవంతుడే కాపాడాలి’.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos