దిగ్గజాలకు సంధి కాలమా…?

దిగ్గజాలకు సంధి కాలమా…?

హొసూరు : కృష్ణగిరి జిల్లాలో వారిద్దరూ కాకలుతీరిన రాజకీయ యోధులు. ఇద్దరూ అధికార ఏడీఎంకేకు చెందినవారే. అయితే ఎప్పుడూ ఎడమొహం, పెడమొహమే. వారే…మాజీ మంత్రి కేపీ. మునిస్వామి, లోక్‌సభ మాజీ స్పీకర్‌ తంబిదురై. రాజ్యసభ ఎన్నికల పుణ్యమా అని వీరిద్దరూ పక్కపక్కనే కూర్చోవడం…విపక్షాలను అటుంచి…సొంత పార్టీ వారికే ఆశ్చర్యం కలిగించింది. తాము చూస్తున్నది నిజమేనా…అని కాసేపు ఒళ్లు గిల్లుకున్న వారూ లేకపోలేదు. ఇద్దరూ ఒకే జిల్లాకు చెందిన వారైనా, పార్టీ అధిష్టానం వీరిద్దరికీ రాజ్యసభ అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. వీరి ఎన్నిక కూడా లాంఛనమే. చెన్నైలో వీరిద్దరూ ఒకే చోట కూర్చుని మాట్లాడుకోవడమే ప్రస్తుతం జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ నిన్న చెన్నైలో నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు పార్టీకి చెందిన మరో అభ్యర్థి జీకే. వాసన్‌ కూడా నామపత్రాన్ని సమర్పించారు. చాలా రోజుల తర్వాత మునిస్వామి, తంబిదురై ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకోవడం పార్టీ శ్రేణులను నివ్వెరపరుస్తోంది. ఎందుకంటే…వీరిద్దరూ జిల్లాలో రెండు వర్గాలుగా విడిపోయి పనులు చక్కబెట్టేవారు. పార్టీ కార్యక్రమాల విషయంలో కూడా ఎవరికి వారే యమునా తీరే అన్న చందమే. ఇప్పుడు వీరిద్దరూ కలసి మాట్లాడుకోవడం పార్టీ శ్రేణుల్లో చాలా మందికి సంతోషం కలిగిస్తున్నా, కొంత మందికి మింగుడు పడడం లేదు. మిత్ర భేదమే తమకు లాభమనేది వారి లెక్క. ఇప్పటివరకు రెండు వర్గాలుగా విడిపోయిన వీరంతా, ఏకతాటిపైకొస్తే…వచ్చే శాసన సభ ఎన్నికల్లో జిల్లాలో  మెజారిటీ సీట్లు గెలుచుకోవడం ఖాయమనేది పార్టీ శ్రేయస్సును కోరే నాయకులు, కార్యకర్తల అంచనా.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos