కుటుంబం కోసం వ్యవస్థలను నాశనం చేస్తున్నారు..

కుటుంబం కోసం వ్యవస్థలను నాశనం చేస్తున్నారు..

తెలంగాణలో 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా తెరాసలో చేరిపోయి ప్రతిపక్ష విలీనానికి లేఖ సమర్పించడంతో అధికార పక్షంలో ప్రతిపక్షం విలీనమైనట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించడంతో కాంగ్రెస్‌ నేతలు తెరాస అధినేత కేసీఆర్‌పై మండిపడుతూ నిరసనల బాట పట్టారు. విలీనంపై టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పందిస్తూ..తన కుటుంబం కోసం,పార్టీ కోసం కేసీఆర్‌ తెలంగాణలో వ్యవస్థలను నాశనం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు తాము కేసీఆర్‌కు సహకరించామని .. అయితే అప్పటి నుంచి కేసీఆర్‌ వికారంగా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు.ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా కొనుక్కుంటూ.. వాళ్లపై అనర్హత పిటిషన్ ఇస్తే స్పీకర్ పట్టించుకోలేదని ఉత్తమ్ తెలిపారు. స్పీకర్‌కు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్ధాయిలో రాజ్యాంగం హోదాను కల్పించిందని… అయితే తెలంగాణ సభాపతి ఆ స్ధాయికి మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రహస్య ప్రదేశంలో కలిసి స్పీకర్ విలీన ప్రక్రియను పూర్తి చేశారని పేర్కొన్నారు. దళితుడు, ముస్లిం ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే కేసీఆర్‌కు నచ్చదా అని ఉత్తమ్ ప్రశ్నించారు.టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. పార్టీ మారకుంటే అరెస్ట్ చేస్తామని రోహిత్ రెడ్డని నవీన్ రావు బెదిరించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. విలీనంపై హైకోర్టుకు వెళుతున్నామని… అక్కడి తీర్పును అనుసరించి సుప్రీంకు వెళతామని ఆయన స్పష్టం చేశారు. ఎనిమిదవ తేదీన భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు.విలీనంపై మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి కూడా మండిపడ్డారు.పార్టీలను విలీనం చేసే అధికారం శాసనసభ సభాపతికి లేదని ఈ అంశం స్పీకర్‌ పరిధిలోకి రాదన్నారు.పార్టీల విలీన ప్రక్రియను కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రధాన అధికారి మాత్రమే చేపట్టాలన్నారు.సభ నిర్వహణతో పాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై విచారణ జరిపి వారిపై అనర్హత వేటు వేసే అధికారం మాత్రమే స్పీకర్‌కు ఉంటుందన్నారు.

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos