టాప్ ఆర్డర్ లక్ష్యం

టాప్ ఆర్డర్ లక్ష్యం

మౌంట్‌ మాంగనూయి: రెండో వన్డేలో టీమిండియా టాప్‌ ఆర్డర్‌ను త్వరగా పెవిలియన్‌ పంపించడమే తమ ప్రధాన లక్ష్యమని న్యూజిలాండ్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ అన్నాడు. శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ వన్డే ఫార్మాట్‌లో ఎలాంటి విధ్వంసం సృష్టించగలరో అందరికీ తెలుసన్నాడు. ‘ఒక బౌలింగ్‌ విభాగంగా మేం ప్రత్యర్థి టాప్‌ ఆర్డర్‌ను కకావికలం చేసి భారత మిడిలార్డర్‌పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తాం. బహుశా వారి రహస్యమూ ఇదే కావొచ్చు. పది ఓవర్లలోపే మూడు వికెట్లు పడగొడితే టీమిండియా శిబిరంలో ఎంత ఒత్తిడి ఉంటుందో మాకు తెలుసు. తొలి వన్డేలో మమ్మల్ని చిత్తుగా ఓడించారు. మేమెక్కడ పొరపాటు చేశామో తెలుసుకున్నాం. కొన్ని తప్పులను దిద్దుకునేందుకు బ్యాట్స్‌మెన్‌ ప్రయత్నిస్తున్నారు. బ్యాట్స్‌మెన్‌ వచ్చి నిలదొక్కుకొని భారీ లక్ష్యాలను నిర్దేశిస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడొచ్చు’ అని బౌల్ట్‌ అన్నాడు. గతంలో తమ బ్యాట్స్‌మెన్‌ క్రీజులో నిలిస్తే భారీ స్కోర్లు చేశారని బౌల్ట్‌ గుర్తు చేశాడు. ఈ ఫార్మాట్‌లో ముందుగానే వికెట్లు చేజార్చుకుంటే పరిస్థితి ఘోరంగా ఉంటుందన్నాడు. మంచి భాగస్వామ్యాలు లభిస్తేనే చివరి ఓవర్లలో భారీ పరుగులు చేయొచ్చని వెల్లడించాడు. భారత జట్టులో అద్భుతమైన బ్యాట్స్‌మెన్‌ ఉన్నారని వారిని త్వరగా ఔట్‌ చేయడం కష్టమేనని పేర్కొన్నాడు. కాగా అందరూ మనుషులే కాబట్టి ఎక్కడో ఓ చోట తప్పు చేయకపోరని బౌల్ట్‌ తెలిపాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos