టోల్ గేట్ల లొల్లి.. ప్రభుత్వాలు వద్దన్నా “పైసా వసూల్”

టోల్ గేట్ల లొల్లి.. ప్రభుత్వాలు వద్దన్నా “పైసా వసూల్”

సంక్రాంతి పండుగ సందర్భంగా ఈనెల 13, 16 తేదీల్లో టోల్ ఛార్జీలు ఉండబోవని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రకటించాయి. అయితే టోల్ ప్లాజాల నిర్వాహకులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించారు. కేంద్రం ఆదేశాలు పరిగణనలోకి తీసుకుంటాము గానీ రాష్ట్ర ప్రభుత్వాల జోక్యమేంటి అన్నట్లుగా ప్రవర్తించారు. దీంతో రెండు రాష్ట్రాల్లోని టోల్ గేట్ల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టోల్ ప్లాజాల దగ్గర ఛార్జీలు వసూలు చేయడానికి ఒక్కో వాహనానికి చాలా సమయం తీసుకుంటుంది. పండుగ నేపథ్యంలో ఒక్కో టోల్ గేట్ దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ కడుతున్న పరిస్థితి. దీంతో రద్దీ నివారించడానికి, ఆయా రూట్లలో వాహనాలు సాఫీగా సాగిపోవడానికి రెండు ప్రభుత్వాలు కూడా టోల్ గేట్ల దగ్గర ఛార్జీలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించాయి. అయితే కొన్నిచోట్ల యథావిధిగా ఛార్జీలు వసూలు చేయడంతో వాహనదారులు నిలదీశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. కొన్నిచోట్ల పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపించింది.
సర్కార్ వద్దంది.. టోల్ గేట్ ఇమ్మంది..
రచ్చ రచ్చ సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు రోజులు టోల్ గేట్ ఛార్జీలు ఉండవని ప్రకటించాయి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు. ఆదివారం (13వ తేదీ) తో పాటు బుధవారం (16వ తేదీ) నాడు టోల్ గేట్ ఛార్జీలు ఉండబోవని తెలిపాయి. దీంతో పండుగ నేపథ్యంలో సొంత గ్రామాలకు వెళ్లేవారికి ఊరట లభించినట్లైంది. ఛార్జీలు వసూలు చేయడానికి ఒక్కో వాహనానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో టోల్ గేట్ల దగ్గర వీపరీతమైన రద్దీ ఏర్పడుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. అయితే చాలాచోట్ల టోల్ ప్లాజాల సిబ్బంది ఆ ఆదేశాలను బేఖాతరు చేశారు. వాహనదారుల నుంచి ముక్కుపిండి ఛార్జీలు వసూలు చేశారు. కొన్నిచోట్ల వాహనదారులు తిరగబడటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఆగ్రహం తెప్పించిన సిబ్బంది తీరు…
నల్గొండ జిల్లా పరిధిలోని టోల్ ప్లాజాల దగ్గర ఉద్రిక పరిస్థితులు తలెత్తాయి. విజయవాడ వైపు వెళ్లే వాహనాలు భారీగా క్యూ కట్టాయి. రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో తమకు సంబంధం లేదని టోల్ గేట్ సిబ్బంది మొండిగా వాదించడంతో వాహనదారులు అసహనానికి గురయ్యారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో స్థానిక అధికారులు చొరవ తీసుకుని టోల్ ప్లాజాల నిర్వాహకులతో మాట్లాడారు. దీంతో ఆయా చోట్ల ఛార్జీలు తీసుకోవడం నిలిపివేశారు. అప్పటివరకు వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. ఎట్టకేలకు టోల్ గేట్ ఛార్జీలు ఎత్తివేయడంతో సాఫీగా సాగిపోవడానికి లైన్ క్లియరైంది.
డబ్బులు ముఖ్యం కాదు.. రద్దీతోనే ఇబ్బంది…
ఆదివారం ఉదయం నుంచి టోల్ ప్లాజాల దగ్గర పరిస్థితి వివరిస్తూ మీడియాలో కథనాలు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. టోల్ ప్లాజాల నిర్వాహకులతో మాట్లాడి ఛార్జీలు ఎత్తివేయాలని ఆదేశించారు. అయినప్పటికీ కొన్నిచోట్ల మధ్యాహ్నం (ఆదివారం – 13వ తేదీ) వరకు కూడా ఛార్జీలు వసూలు చేసినట్లు సమాచారం. మరికొన్ని చోట్ల టోల్ గేట్ సిబ్బంది అతి తెలివి ప్రదర్శించినట్లుగా తెలుస్తోంది. కాసేపు ఛార్జీలు వసూలు చేయడం, మరి కొద్దిసేపు నిలిపివేయడం చేస్తూ వాహనదారులను అయోమయానికి గురిచేశారు. మొత్తానికి పండుగ వేళ టోల్ ఛార్జీలు వద్దన్న ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల ఆదేశాలను ప్లాజాల నిర్వాహకులు బేఖాతరు చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డబ్బులు ఇవ్వడానికి ప్రాబ్లమ్ లేదని.. గంటలకొద్దీ క్యూలో ఉండటమే చిరాకు తెప్పించిందని వాపోయారు కొందరు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos