నల్లగొండ: నాగార్జునసాగర్ నీటి విడుదల వివాదంపై ఏపీ పోలీసులు, ఇరిగేషన్ అధికారులపై కేసులు నమోదయ్యాయి. అనుమతి లేకుండా డ్యామ్పైకి వచ్చి కుడి కాల్వకు నీటిని విడుదల చేశారంటూ తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులు, తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని అందులో పేర్కొన్నారు. దీంతో ఏపీ పోలీసులు, అధికారులపై సాగర్ పోలీసులు 441, 448, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సాగర్ ప్రాజెక్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యామ్పై పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిణి స్మితా సభర్వాల్, నీటి పారుదల శాఖ అధికారులు డ్యామ్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా, సాగర్ ప్రాజెక్టు ఈఎన్సీ హరి రామ్, సీఈ హమీద్ ఖాన్, రమేశ్ బాబు, ధర్మనాయక్ డ్యామ్ వద్దకు చేరుకున్నారు.