ఏపీ భవనాల స్వాధీనం వెనుక అసలు కథ..

ఏపీ భవనాల స్వాధీనం వెనుక అసలు కథ..

హైదరాబాద్‌ నగరంలోనున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన భవనాలను తమ అధీనంలోకి తీసుకోవడానికి కేసీఆర్‌ ఆసక్తి కనబరస్తుండడం వెనుక తెలంగాణకు కొత్త సచివాలయాన్ని నిర్మించే ఉద్దేశమే ప్రధానకారణంగా తెలుస్తోంది.ప్రస్తుతం ఉన్న సచివాలయానికి వాస్తు దోషం ఉందని భావిస్తున్న కేసీఆర్‌ తెలంగాణకు కొత్త సచివాలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.దీంతోపాటు అన్ని హెచ్ ఓ డి కార్యాలయాలతో పాటు మంత్రుల చాంబర్లు కూడా ఒకే చోట ఉండేలా సచివాలయం ఉండాలని కేసీఆర్ భావన.అందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన భవనాలను తమ అధీనంలోకి తీసుకోవడానికి కేసీఆర్‌ చర్యలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం తెలంగాణ సచివాలయాన్ని పరిశీలిస్తే తెలంగాణ సచివాలయం ఆవరణలోనే ఏపీ ప్రభుత్వానికి నాలుగు బ్లాకులను కేటాయించారు.రాష్ట్ర విభజన సమయంలో హెచ్, జే, కె, ఎల్ బ్లాకులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించగా ఏ,బీ, సీ, డీ బ్లాకులు తెలంగాణ ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి.రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ మొదటి ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు హైదరాబాద్‌ కేంద్రంగా  ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన హెచ్, జే, కె, ఎల్ బ్లాకుల నుంచే పరిపాలన సాగించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా నిర్ణయించి అక్కడి నుంచే పాలన సాగించాలనే ఉద్దేశంతో తెలంగాణ సచివాలయంలో ఉన్న సామాగ్రిని అమరావతిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కార్యాలయాలకు తరలించారు.ఇక ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో బాధ్యతలు స్వీకరించిన వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సచివాలయ భవనాలను తెలంగాణకు ఇచ్చేందుకు జగన్ అంగీకరించారు. దీంతో ఏపీ ప్రభుత్వానికి కేటాయించిన ఈ నాలుగు బ్లాకులను తెలంగాణ ప్రభుత్వం తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి చర్యలు ముమ్మరం చేసింది.ఇదే విషయమై ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు సమావేశమై చర్చించారు.ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నాలుగు బ్లాకుల్లోని  సామాగ్రిని త్వరగా తరలించి…. తమకు భవనాలను  అప్పగించాలని  తెలంగాణ ప్రభుత్వం కోరింది.దీంతో పాటు విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రులకు కేటాయించిన క్వార్టర్లను కూడా అప్పగించాలంటూ తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది.ఈ నెల 27వ తేదీ లోపుగా కొత్త సచివాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.సచివాలయ నిర్మాణ పనులు జరిగే సమయంలో  బూర్గుల రామకృష్ణారావు భవనం లేదా… ఆయా హెచ్ ఓ డీ కార్యాలయాల్లో  ఆయా శాఖల కార్యకలాపాలు కొనసాగించే అవకాశం ఉంది..

కొత్త సచివాలయం ఊహా చిత్రం..

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos