మే వరకు తెలంగాణలో ప్రభుత్వం లేనట్లే!

మే వరకు తెలంగాణలో ప్రభుత్వం లేనట్లే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి నెల రోజులు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన గులాబీ దళపతి కేసీఆర్ మాత్రం రాష్ట్ర పాలనా వ్యవహారాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టినట్లు కనిపించట్లేదు. మంత్రివర్గాన్ని ఆయన ఇంకా విస్తరించలేదు. కేవలం ఒకే ఒక్క మంత్రితో బండి లాగిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ కోసం ఆశావహులు చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ మాత్రం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఆయన బిజీగా ఉన్నారు.కేసీఆర్ ఇలా రాష్ట్రంపై ఫోకస్ పెట్టకుండా ఇతర వ్యవహారాలతో బిజీగా ఉండటం వెనుక కారణాలేంటని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. తాజాగా ఈ పరిణామాలపై కేసీఆర్ సన్నిహితవర్గాలు స్పందించాయి. ఇప్పుడే కాదు.. దాదాపు మరో 4 నెలల వరకు కేసీఆర్ ఇలానే వ్యవహరించే అవకాశముందని ఆ తర్వాతే రాష్ట్రంలో పాలనా వ్యవహారాలపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించే అవకాశముందని సూచిస్తున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళే ఇందుకు కారణమని వెల్లడిస్తున్నాయి.

ప్రస్తుతం తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ నెల 30న ఆ ఎన్నికల తుది దశ ముగుస్తుంది. అప్పటివరకు కేసీఆర్ చేయగలిగేది పెద్దగా ఏమీ లేదని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఎలాంటి పథకాలనూ సీఎం ప్రారంభించలేరని కీలక ప్రకటనలు కూడా చేయలేరని గుర్తుచేస్తున్నాయి. అందుకే ఆసరా పింఛన్లు – నిరుద్యోగ భృతి – ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు వంటి హామీలపై కేసీఆర్ ఇంకా మౌనంగా ఉండాల్సి వస్తోందని తెలిపాయి.

పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. కాబట్టి మళ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుతో కేంద్రంలో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్ లోక్ సభ ఎన్నికలకు ఈ దఫా మరింత ఎక్కువగా ప్రాధాన్యమిచ్చే అవకాశముంది. ఆయన మళ్లీ బిజీ అయిపోతారు. అంటే లోక్ సభ ఎన్నికలు ముగిసే వరకు తెలంగాణలో ప్రభుత్వం ఉన్నా లేనట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మే వరకు రాష్ట్ర ప్రభుత్వం స్లీప్ మోడ్ లో ఉన్నట్లే పరిగణించాలని.. ఈ వ్యవధిలో కీలక నిర్ణయాలేవీ వెలువడవని చెబుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos