ఆగస్ట్ 15 తరువాత కొత్త పాలన చూస్తారు..

 భవనాల నిర్మాణాల్లో అవినీతిని పూర్తిగా రూపుమాపే ఉద్దేశంతో కొత్త మున్సిపల్‌ చట్టాన్ని అమల్లోకి తెచ్చినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు.  దేశమే తెలంగాణను చూసి పాలనను నేర్చుకునేలా పాలనా సంస్కరణల్లో మార్పులు తేనున్నట్లుగా చెప్పారు. అక్రమ కట్టడాల్ని తాము ఎట్టి పరిస్థాతుల్లో అనుమతించేది లేదన్నారు.కొత్త మున్సిపల్ చట్టంలో జిల్లా కలెక్టర్లకు విచక్షణాధికారాలు కట్టబెట్టామని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో నగర పంచాయతీలు ఉండవనికేవలం పురపాలక సంఘాలు మాత్రమే ఉంటాయని…128 మున్సిపాలిటీలు, 13 కార్పోరేషన్లు ఉంటాయని ముఖ్యమంత్రి వెల్లడించారు.మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తాము ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకోలేదన్నారు. 500 చదరపు మీటర్ల వెడల్పు, 10 మీటర్ల ఎత్తు వరకు నిర్మాణం జరిగే భవనాల అనుమతి కోసం ఎవ్వరూ మున్సిపాలిటీలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు ముఖ్యమంత్రి.ఇది పూర్తిగా ఆన్లైన్లో మంజూరు చేయడం జరుగుతుందన్నారు. చట్టంలో అక్రమ కట్టడాలకు భారీ జరిమానాలు పెట్టామని సీఎం వెల్లడించారు. ప్రతి ఇంటి యజమాని తన ఇంటికి సంబంధించి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని దాని ప్రకారమే పన్నులు కట్టాల్సి వుంటుందని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే 25 రెట్లు అదనంగా జరిమానా విధిస్తామన్నారు. అక్రమ కట్టడమని తేలితే.. ఎలాంటి నోటీసు లేకుండా దానిని కూల్చివేస్తామన్నారు. ఆగస్టు 15 నుంచి పరిపాలన అంటే ఏంటో చూపిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.ఒక ఇంచు అటవీ భూమి కూడా నష్టపోనివ్వమన్నారు. గ్రామపరిధిలోని 85 శాతం చెట్లు బతికితేనే పంచాయతీ కార్యదర్శి ఉద్యోగంలో ఉంటారని లేకపోతే ఇంటికేనని ముఖ్యమంత్రి హెచ్చరించారు.జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా గ్రీన్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి మున్సిపల్ వార్డులో ప్రతి మూడు నెలలకొసారి ప్రజా దర్భార్ జరుగుతుందని కేసీఆర్ వెల్లడించారు.లే అవుట్ అప్రూవల్స్ని మున్సిపాలిటీ ఇవ్వదని జిల్లా కలెక్టర్ ఇస్తారని తెలిపారు. ఉద్యోగినైనా రాష్ట్రంలోని ఎక్కడికైనా బదిలీ చేస్తామని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా శాసనసభలోనే జరుగుతుందన్నారు.సెంటర్ ఫర్ అర్బన్ ఎక్స్లెన్స్ అనే సంస్థను  ఏర్పాటు చేసి వాటిలో మేయర్, ఛైర్మన్, వార్డు కౌన్సెలర్లకు కఠిన శిక్ష ఇప్పిస్తామని కేసీఆర్ తెలిపారు. మున్సిపల్ చట్టాన్ని ఆమోదింపజేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని భావించామన్నారు.సర్పంచ్ తొలగింపులో పంచాయతీరాజ్ మంత్రికి స్టే అధికారాలను తొలగించామని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో స్మశాన వాటికల నిర్మాణానికి నిధుల్లోంచి ఖర్చు పెట్టుకోవచ్చని కేసీఆర్ పేర్కొన్నారు.కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 75 చదరపు గజాల వరకు నిరుపేదలకు గృహనిర్మాణానికి ఎలాంటి అనుమతి తీసుకోనక్కర్లేదని.. అలాగే వారి ఇంటిపన్ను సంవత్సరానికి రూ.100, రిజిస్ట్రేషన్ ఫీజు రూపాయని కేసీఆర్ వెల్లడించారు. పరిపాలనలోనూ ఎప్పటికప్పుడు సంస్కరణలు అవసరమని కేసీఆర్‌ తెలిపారు. పాలనా పరమైన పెను మార్పులు ఆగస్టు 15 నుంచి వస్తాయని కేసీఆర్ చెప్పటం బాగానే ఉన్నా.. మరింత కాలం చేసిందేమిటి? అన్నది ప్రశ్న.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos