చెరువు కాలువ ఆక్రమణ : ఏడీఎంకే నాయకుని ఆగడం

చెరువు కాలువ ఆక్రమణ : ఏడీఎంకే నాయకుని ఆగడం

హొసూరు : హొసూరు ప్రాంతంలో తరతరాలుగా చెరువుకు నీరందించే కాలువను ఏడీఎంకే పార్టీకి చెందిన ఓ నాయకుడు ఆక్రమించుకొని అడ్డగించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  కాలువ అడ్డగింపుపై అడిగిన తమను బెదిరిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కృష్ణగిరి జిల్లా తళి యూనియన్ సారకపల్లి గ్రామానికి చెందిన మరిసిద్ధేగౌడు ఆ ప్రాంతంలో ఏడీఎంకే  పార్టీ

ప్రముఖునిగా చలామణి అవుతున్నాడు. ఇతనికి సుమారు 20 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది  సారకపల్లి, వాన మంగలం గ్రామా లకు మధ్యలో వంద ఎకరాల విస్తీర్ణంలో ఓ చెరువు ఉంది. ఈ చెరువు కింద సుమారు రెండు వందల ఎకరాల ఆయకట్టు

కూడా ఉంది. చెరువు సమీపంలో మరిసిద్ధే గౌడ్ కు చెందిన వ్యవసాయ భూమి  ఉంది. ఆ భూమిలో  కొంత దూరం వరకు చెరువుకు వర్షపు నీరు చేరే కాలువ ఉండడంతో, ఆ కాలువ తనకే సొంతమని మరిసిద్ధేగౌడు  ఆక్రమించడమే కాక అతని వ్యవసాయ పొలంలో పెద్ద ట్యాంకు తవ్వి ఈ కాలువలో వచ్చిన వర్షపు నీటిని ట్యాంకుకు నింపేందుకు ఏర్పాట్లు చేశాడు.

ఇటీవల తళి ప్రాంతంలో వర్షాలు కురవడంతో చెరువుకు రావాల్సిన నీరు పూర్తిగా మరిసిద్ధేగౌడు ఏర్పాటు చేసిన ట్యాంకుకు చేరింది. దీనిపై వానమంగలం,  సారక పల్లి గ్రామస్తులు ఆయనను నిలదీశారు. అయినా మరిసిద్ధేగౌడు గ్రామస్తులను బెదిరించడంతో చేసేదిలేక వారు అధికారులను ఆశ్రయించారు. మరిసిద్ధే గౌడ్ పాలక పార్టీ నాయకుల ప్రోద్బలంతో అధికారులను కూడా కట్టడి చేశాడని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాన మంగలం ,సారకపల్లి చుట్టుపక్కల మూడు గ్రామాలకు చెందిన ప్రజలు ఈ చెరువు నీటి పై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని, చెరువు నీటిని అడ్డగించడంతో ఇక్కడ వ్యవసాయం పూర్తిగా దెబ్బతినే ప్రమాదముందని వానమంగలం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులకు సమాచారం అందించి నా, ఎవరూ స్పందించలేదని గ్రామస్తులు వాపోయారు. పాలక పార్టీ నాయకుల అండదండలతో మరిసిద్ధేగౌడు గ్రామస్తులను సైతం బెదిరిస్తూ నోరు మెదపకుండా చేస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు. చెరువు నీటిని అడ్డగించిన ఏడీఎంకే పార్టీ నాయకుడు మరిసిద్ధేగౌడుపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించేందుకు వెనుకాడమని బాధితులు హెచ్చరించారు.

తాజా సమాచారం