తలాక్‌ ముసాయిదాపై రభస

తలాక్‌ ముసాయిదాపై రభస

న్యూఢిల్లీ: ముమ్మారు తలాక్ చెప్పి తక్షణమే విడాకులు ఇవ్వడాన్ని భారత శిక్షా స్మృతి కింద నేరంగా పరిగణిస్తూ న్యాయమంత్రి రవి శంకర్ ప్రసాద్ శుక్రవారం లోక్సభలో ప్రవేశ పెట్టిన ముమ్మారు తలాక్ (ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణముసాయిదా-2019) ముసాయిదా సభలో రభస సృష్టించింది. ముమ్మారు తలాక్ విధానానికి తాము వ్యతిరేకమైనా దాన్ని నేరంగా పరిగణిస్తూ జైలు శిక్ష విధించడాన్ని తాము సమ్మతించబోమని కాంగ్రెస్ సభ్యుడు శశిథరూర్ తెలిపారు. శశి థరూర్ వాదనల్ని కాంగ్రెస్, ఎంఐఎం సభ్యులు సమర్థించటంతో పాలక పక్ష సభ్యులు ఆక్షేపించారు. దరిమిలా అరుపులు, కేకల మధ్యే మంత్రి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ‘కేవలం ముస్లిం మతానికి చెందిన భర్తలు మాత్రమే తమ భార్యలను విడిచిపెట్టడం లేదు, ఇది అన్ని మతాల్లోనూ ఉన్నందున మహిళలందరికీ భద్రత కల్పించేలా చట్టం రూపొందించాలని’ శశి ధరూర్‌ డిమాండు చేసారు. ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా ముసాయిదా పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తీకరించారు. అది రాజ్యాంగంలోని 14, 15 అధికరణలకు వ్యతిరేకంగా ఉందని తప్పుబట్టారు. కేవలం ముస్లిం పురుషులను మాత్రమే శిక్షించేలా ఈ చట్టాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు. తక్షణ ముమ్మారు తలాక్ ద్వారా విడాకులు కుదరదని ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానం ప్రకటించిందని ఒవైసీ పేర్కొన్నారు. ముస్లిం మహిళలకు న్యాయం చేస్తామంటున్న ప్రభుత్వం శబరిమల విషయంలో హిందూ మహిళల పట్ల ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఒవైసీ నోట శబరిమల మాట రాగానే సభలో మళ్లీ గందరగోళం రేగింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos