కొడియాళం ఎత్తిపోతల పథకానికి మోక్షం : జోరుగా సర్వే పనులు

కొడియాళం ఎత్తిపోతల పథకానికి మోక్షం : జోరుగా సర్వే పనులు

హోసూరు : ఇక్కడికి  సమీపంలోని  కొడియాళం ఎత్తిపోతల పథకానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ పథకం ద్వారా దక్షిణ పెన్నా నీటిని కాలువల ద్వారా 30 చెరువులను నింపడానికి అయిదు మంది ఇంజనీర్ల బృందం బాగలూరు ప్రాంతంలో సర్వే పనులు ముమ్మరంగా నిర్వహిస్తోంది. దక్షిణ పెన్నా నదిపై కొడియాళం వద్ద నిర్మించిన చెక్ డ్యాం ద్వారా ఆ ప్రాంతంలోని రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఈ చెక్ డ్యాం నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా కొడియాళం నుంచి బేరికె వరకు గల 30 చెరువులను నింపడం ద్వారా తమకు సాగు నీరు అందించాలనేది బాగలూరు ప్రాంత రైతుల చిరకాల వాంఛ. దీనికోసం ఆ ప్రాంత రైతులు వివిధ రాజకీయ పార్టీల నాయకుల ద్వారా తమిళనాడు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లారు. హోసూరు మాజీ ఎమ్మెల్యేలు గోపినాథ్, కె.ఎ. మనోహరన్‌లు కొడియాళం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల మాజీ మంత్రులు కె.పి. మునిస్వామి,  బాలకృష్ణారెడ్డిలు సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. నాయకుల ఒత్తిడికి తలొగ్గిన రాష్ట్ర  ప్రభుత్వం కొడియాళం  ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడానికి సర్వే నిర్వహించి, ప్రాజెక్టు రిపోర్ట్ పంపించాలని ప్రజా పనుల శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అయిదు మందితో కూడిన ఇంజనీర్ల బృందం కొడియాళం వద్ద నుంచి సర్వే పనులు ప్రారంభించింది. అన్నీ సజావుగా సాగితే ఆ ప్రాంతంలో వేల మంది లబ్ధి పొందుతారని రైతులు తెలిపారు. అయితే బాలిగానపల్లి, ఆలూరు, గనగొండపల్లి చెరువులను పక్కన పెట్టి సర్వేలు నిర్వహిస్తున్నారని ఆ మూడు గ్రామాలకు చెందిన రైతులు మండిపడుతున్నారు. ఈ మూడు చెరువులను మినహాయిస్తే మూడు వందల మంది రైతులు నష్టపోతారని ఆప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా పనుల శాఖ అధికారులు మూడు గ్రామాల రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని బాలిగానిపల్లి, ఆలూరు, గనగొండపల్లి గ్రామాలకు చెందిన చెరువులను పాజెక్టు రిపోర్టులో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఏదేమైనా కొడియాలం ఎత్తిపోతల పథకం కోసం నాయకులు ఇన్నాళ్లూ చేసిన కృషి ఫలించినట్లేనని బాగలూరు ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos