ఆందోళన చేసిన అతివలకు అరదండాలు

ఆందోళన చేసిన అతివలకు అరదండాలు

శ్రీనగర్ : జమ్మూ-కశ్మీర్ ప్రతిపత్తిని రద్దు చేసినందుకు మంగళవారం ఇక్కడ నిరసన ప్రదర్శన జరిపిన మహిళలను పోలీసులు బంధించారు. వారిలో మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సోదరి సురయ్య అబ్దుల్లా, కుమార్తె సఫియా అబ్దుల్లా ఖాన్ ఉన్నారు. వారిద్దరి ఆధ్వర్యంలో మహిళలు చేతులకు నల్ల పట్టీలు ధరించి, నినాదాలు రాసిన అట్టల్ని చేత బట్టి ఒక చోట చేరేందుకు ప్రయత్నించినపుడు పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డుపై కుర్చోని ఆందోళన చేపట్టారు. వెంటనే రంగంలోకి దిగిన సీఆర్పీఎఫ్ మహిళా అధికారులు వారిని బంధించి అక్కడి నుంచి తరలించారు. ఆందోళన కారులు మాధ్యమాలతో కూడా మాట్లాడకుండా అడ్డుకున్నారు. అయినప్పటికీ వారు పత్రిక ప్రకటన విడుదల చేసారు. ‘కశ్మీర్లోని ప్రజల స్వేచ్ఛను, ప్రాథమిక హక్కులను పునరుద్ధరించాలి. ప్రస్తుత పరిస్థితులు ప్రజల్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆర్టికల్ 370, 35ఏ లను రద్దును కశ్మీర్ మహిళలుగా తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోము.గృహ నిర్బంధంలో ఉన్న నేతలందరినీ తక్షణమే విడుదల చేయాలి. కశ్మీర్లో నెలకొన్న పరిస్థితులకు విరుద్ధంగా, వాస్తవాలను వక్రీకరించేలా జాతీయ మీడియా కథనాలు ఉంటున్నాయ’ని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos