ఆందోళన కలిగిస్తున్న ఆత్మహత్యలు..

అప్పులో,కుటుంబ కలహాలో,పరీక్షల్లో తప్పడమో లేదా ప్రేమలో విఫలం కావడమో ఇలా ఎదో ఒక కారణంతో దేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారి సంఖ్యా ఏడాదికేడాది గణనీయంగా పెరిగిపోతోంది.తాజాగా జాతీయ నేర గణాంక విభాగం (ఎస్‌సీఆర్‌బీ) వెల్లడించిన గణాంకాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న ఆత్మహత్యల్లో మహారాష్ట్ర ముందువరుసలో నిలవగా, ఆ తర్వాతి స్థానంలో తమిళనాడు నిలిచింది. జాతీయ నేర గణాంకాల విభాగం (ఎన్‌సీఆర్‌బీ) తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గతేడాది 18 వేలకిపైగా ఆత్మహత్యలతో మహారాష్ట్ర ఈ జాబితాలో తొలిస్థానంలో నిలిచింది.ఇక, 13 వేలకుపైగా ఆత్మహత్యలతో తమిళనాడు ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. పశ్చిమ బెంగాల్ 12 వేలకు పైగా ఆత్మహత్యలతో మూడోస్థానంలో నిలవగా, నాలుగైదు స్థానాల్లో మధ్యప్రదేశ్, కర్ణాటక నిలిచాయి. మధ్యప్రదేశ్‌లో 12,457 మంది, కర్ణాటకలో 11,288 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఐదు రాష్ట్రాల్లోనే 49.5 శాతం ఆత్మహత్యలు నమోదయ్యాయి.ఇక, తెలంగాణలో 7,675 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో 2,858 మంది కూలీలే ఉండడం గమనార్హం. అలాగే, 499 మంది రైతులు కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. 6,465 ఆత్మహత్యలతో ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ తర్వాతి స్థానంలో నిలిచింది.కాగా, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, ఉత్తరాఖండ్, మణిపూర్, చండీగఢ్, డామన్ అండ్ డయ్యు, ఢిల్లీ, లక్షద్వీప్, పుదుచ్చేరిలలో ఒక్క రైతు కూడా ఆత్మహత్యకు పాల్పడకపోవడం ఊరటనిచ్చే అంశం. ఇక, సామూహిక/కుటుంబ ఆత్మహత్యల్లో తమిళనాడు 16 ఘటనలతో అగ్రస్థానంలో ఉండగా, 14 ఘటనలతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది.దేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో పురుషులే అత్యధికమని జాతీయ నేర గణాంక విభాగం (ఎస్‌సీఆర్‌బీ) వెల్లడించిన గణాంకాలను బట్టి తెలుస్తోంది. 2019లో సగటున రోజుకు 381 మంది చేసుకుంటున్నారు. వీరిలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఉంటున్నారు. గతేడాది 1,39,123 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది అత్యధికం. 2018లో 1,34,516 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక, ఆత్మహత్యకు పాల్పడుతున్న వారిలో 70.2 శాతం మంది పురుషులు ఉండగా, మహిళల శాతం 29.8 శాతం.
వివాహం తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో పురుషుల సంఖ్యే అధికమని ఎన్‌సీఆర్‌బీ పేర్కొంది. వివాహం తర్వాత 68.4 శాతం మంది పురుషులు ఆత్మహత్యలకు పాల్పగా, 62.5 శాతం మంది మహిళలు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు.నగరాల్లోనే ఆత్మహత్యలు రేటు ఎక్కువగా ఉందని ఎస్‌సీఆర్‌బీ పేర్కొంది. ఇక, ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో 53.6 శాతం ఉరివేసుకోగా, 25.8 శాతం మంది విషం తీసుకుని, 5.2 శాతం శాతం మంది నీళ్లలో మునిగి, 3.8 శాతం నిప్పంటించుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు.కుటుంబ సమస్యల కారణంగా 32.4 శాతం మంది, వివాహ సంబంధిత సమస్యల కారణంగా 5.4 శాతం మంది, అనారోగ్య కారణాల వల్ల 17.5 శాతం మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారని తేలింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos