మీడియా షాక్‌ : కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు

మీడియా షాక్‌ : కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు

ముంబై: లాభాలతో ఉత్సాహంగా కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు  అకస్మాత్తుగా నష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా మీడియా షేర్లలో అమ్మకాల వెల్లువెత్తడంతో  సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా కోల్పోయింది.  డబుల్‌ సెంచరీ లాభాలతో మొదలైన మార్కెట్లు తిరిగి 200 పాయింట్లు కోల్పోయాయి. మొత్తంగా దలాల్‌ స్ట్రీట్‌ 400 పాయింట్లు  కుప్పకూలింది. మీడియా ఏకంగా 13శాతం కుప్పకూలింది. ఇందులో ప్రధానంగా ఎస్సెల్‌ గ్రూప్‌ కౌంటర్లలో భారీగా అమ్మకాలు ఊపందుకోవడం మార్కెట్లను దెబ్బతీసింది. వాటా కొనుగోలుకు సంబంధించి సోనీ, జీ ప్రమోటర్‌ అయిన ఎస్సెల్‌ గ్రూపుతో చర్చలు జరుపుతోందని వార్తలు  తాజాగా వెలువడ్డాయి. దీంతో అమ్మకాలు జోరందుకున్నాయి. మీడియా కౌంటర్లలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 25 శాతం కుప్పకూలింది. దీంతో ఆల్‌టైం కనిష్టాన్ని తాకింది. డిష్‌ టీవీ 19 శాతం  పతనమైంది. ఇంకా జీ మీడియా, సన్‌ టీవీ, ఈరోస్‌, టీవీ 18, జాగరణ్‌, పీవీఆర్‌, డీబీ కార్ప్‌ 6-2 శాతం మధ్య నష్టపోయాయి. మరోవైపు ఈ వార్తలపై స్పందించేందుకు సోనీ ప్రతినిధి నిరాకరించారు. అటు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రతినిధి స్పందిస్తూ ప్రస్తుతం దీనిపై ఏమీ వ్యాఖ్యానించలేమని, ఈనేపథ్యంలో ఎలాంటి ఊహాగానాలను, పుకార్లను వ్యాప్తి చేయవద్దని  కోరారు.  చర్చలు కీలక దశకు చేరుకున్నాక  కంపెనీ చేసే అధికారిక  ప్రకటన కోసం వేచి చూడాలని విజ్ఞప్తి చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos